
గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆస్పత్రి
గుంటూరు మెడికల్: రాజధాని ఆస్పత్రిగా అవతరించిన గుంటూరు జీజీహెచ్‌లో సివిల్ సర్జన్ రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్(సీఎస్‌ఆర్‌ఎంఓ) పోస్టు 14 ఏళ్లుగా ఖాళీగా ఉంది. ఆస్పత్రిలో పరిపాలన విషయాల్లో కీలకమైన ఆర్‌ఎంఓ పోస్టు ఖాళీగా ఉండడంతో పరిపాలన గాడి తప్పుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు చేసిన వ్యక్తినే ఆర్‌ఎంఓగా నియమించాల్సి ఉంది. ఆ కోర్సు చేసిన వైద్యులు ఉన్నప్పటికీ ఆర్‌ఎంఓ పోస్టును ప్రభుత్వం భర్తీ చేయకుండా కాలయాపన చేస్తుండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసిస్టెంట్ ఆర్‌ఎంఓగా డాక్టర్ యనమల రమేష్, డిప్యూటీ ఆర్‌ఎంఓగా డాక్టర్ ఎ.ఆదినారాయణ విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరి మధ్య సఖ్యత లేకపోవడం, ఒకరంటే ఒకరికి గిట్టకపోవడంతో ఇద్దరూ కలిసి ఏనాడూ ఏ ఒక్క సమస్య గురించి చర్చించుకోకుండా ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారు.
క్యాజువాలిటీలో వైద్యసేవలు అందడం లేదని నిత్యం ఫిర్యాదులు వస్తున్నా అత్యవసర వైద్యం కోసం వచ్చిన వారు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయి ఆస్పత్రి ఎదుట ఆందోళనలు చేస్తున్నా ఆర్‌ఎంఓలు కలిసి చర్చించుకుని సమస్యలను పరిష్కరించక పోవడం వల్లే ఆస్పత్రి పరువు బజారున పడుతుందనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో క్యాజువాలిటీలో వైద్యసేవలు అందడం లేదు. ఆదివారం ఇతర సెలవు రోజుల్లో సైతం క్యాజువాలిటీ వైద్యసేవల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నా ఆర్‌ఎంఓలు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. గతంలో ఆస్పత్రిలో నాల్గోతరగతి ఉద్యోగులుగా కొంత మంది ప్రైవేటు వ్యక్తులు ఉద్యోగాలు చేస్తూ పట్టుబడడం ఇందుకు ఉదాహరణ. మూడు రోజుల క్రితం ఓ పసికందు ఉదయం 5 గంటలకు చని పోతే బిడ్డ చనిపోయినందుకు కారణాలు తెలియజేసి వారిని శాంతింప చేయడంలో వైద్యాధికారులు విఫలం అయ్యారు. సాయంత్రం 4 గంటల వరకు చనిపోయిన బిడ్డతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలోనే ఉండి ఆందోళన చేసిన సంఘటన ఆర్‌ఎంఓ వ్యవస్థ వైఫల్యాలను బయటపెట్టింది.
ఆస్పత్రిలో కీలక విధులన్నీ ఆర్‌ఎంఓకే...
ఆర్‌ఎంఓ ఆస్పత్రిలోనే నివాసం ఉండి రాత్రి వేళల్లో క్యాజువాలిటీలాంటి అత్యవసర వైద్యసేవల విభాగాల్లో వైద్య సేవల్లో జాప్యం లేకుండా చూడాలి. ఓపీ విభాగంలో రోగులకు వైద్యసేవలు అందేలా చూడడం, మందుల నిల్వల విభాగం(డిస్పెన్సరీ) లో పర్యవేక్షణ చేసి అన్ని మందులు రోగులకు అందుబాటులో ఉండేలా చూడడం, వర్క్‌షాపుపై పర్యవేక్షణ చేసి వైద్య పరికరాలకు కొద్దిపాటి రిపేర్లు తక్షణమే చేయించడం, ఎలక్ట్రికల్, సివిల్ పనులు చేయించడం ఆర్‌ఎంఓ విధుల్లో భాగమే. ఆస్పత్రిలో నాల్గవతరగతి ఉద్యోగులు, ఫార్మసిస్టులు, పారామెడికల్ సిబ్బంది పనితీరును పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత ఆర్‌ఎంఓదే. శానిటేషన్ మెరుగు పర్చటం, డైట్ ను తనిఖీ చేసి నాణ్యమైన భోజనం రోగులకు అందేలా చూడడం, మంచినీటి సమస్య లేకుండా చూడడం, జనన, మరణాల నమోదు సక్రమంగా జరిగేలా చూడడం, మెడికల్ స్టోర్స్ నుంచి శాంపిల్స్ సేకరించి ప్రతినెలా ఎనాలసిస్ కోసం పంపించడం, చోరీల నియంత్రణ, మెడికల్ రికార్డ్స్ విభాగం పనితీరును పర్యవేక్షించడం తదితర పనులు ఆర్‌ఎంఓ చేయాల్సి ఉంది.
రెగ్యులర్ నియామకాలు ఎప్పటికో..!
ఆర్‌ఎంఓలకు కేటాయించిన విధులు ఆస్పత్రి అధికారులు తమ చేతుల్లోనే ఉంచుకుని వారిని డమ్మీలుగా చిత్రీకరించినట్టు వైద్య సిబ్బంది చెప్పుకుంటున్నారు.ఆర్‌ఎంఓలకు వచ్చే పారితోషికాల కోసం అధికారులు వారిని పక్కనబెట్టినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్‌ఎంఓలకు అధికారాలు ఇస్తే తమ పవర్ ఎక్కడ తగ్గిపోతుందోననే భయంతోనే ఆస్పత్రి అధికారులు ఆర్‌ఎంఓలను పక్కనపెట్టినట్టు ఆస్పత్రి సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి సుమారు 14 ఏళ్లుగా ఖాళీగా ఉన్న రెగ్యులర్ సీఎస్‌ఆర్‌ఎంఓ పోస్టును భర్తీ చేసి ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు పేదలకు అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
హెచ్‌డీఎస్ మీటింగ్‌లోఆమోదించాం
ఆస్పత్రిలో సీఎస్‌ఆర్‌ఎంఓ పోస్టు భర్తీ చేసేందుకు ప్రభుత్వం నివేదిక కోరింది. ఆర్‌ఎంఓ పోస్టును భర్తీ చేయాలని హెచ్‌డీఎస్ మీటింగ్‌లో సైతం ఆమోదించాం. ఆర్‌ఎంఓ పోస్టు భర్తీ చేస్తే పరిపాలనలో ఆస్పత్రికి ఎంతో మేలు చేకూరుతుంది.–డాక్టర్ డీఎస్ రాజునాయుడు,ఆస్పత్రి సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment