అవినీతి సొమ్ముతోనే ఎమ్మెల్యేల కొనుగోళ్లు
► చంద్రబాబు రెండేళ్ల పాలన అవినీతిమయం
► విభజన హామీలపై నోరుమెదపని కేంద్రమంత్రులు
► పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
► వైఎస్సార్ సీపీ నేత సామినేని ఉదయభాను
జగ్గయ్యపేట అర్బన్ : స్వతంత్ర భారతం ఏనాడూ కనీవినీ ఎరుగని రీతిలో, ఏ రాష్ట్రంలో లేనివిధంగా ముఖ్యమంత్రి, మంత్రులు అవినీతికి పాల్పడుతూ ఆ సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు వలవిసిరి కొనుగోళ్లకు పాల్పడుతున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సామినేని ఉదయభాను పేర్కొన్నారు. శనివారం ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ ఒక పార్టీలో ఎన్నికైన ఎమ్మెల్యేలను అధికారపార్టీలోకి ఫిరాయించేలా ప్రలోభపెట్టడం హేయమన్నారు. ఒకపార్టీ గుర్తుపై గెలిచిన వారు వేరే పార్టీలోకి చేరాలంటే ముందుగా రాజీనామా చేయాలన్నారు.
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పార్టీ ఫిరాయింపులను పూర్తిగా వ్యతిరేకించారని, కానీ ఆయన అల్లుడు చంద్రబాబు ఆ విలువలను తుంగలో తొక్కి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఉదయభాను ఆరోపించారు. విపక్ష ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి మారితే వారి నియోజకవర్గంలో ప్రథమ పౌరుడిస్థాయి నుంచి చివరిస్థాయికి దిగజారినట్లేనని ఎద్దేవా చే శారు. ఇలాంటి నేతలకు భవిష్యత్‌లో విలువ ఉండదన్నారు. కేంద్రప్రభుత్వానికి నిజాయతీ ఉంటే ఏపీలో జరుగుతున్న ఫిరాయింపులపై విచారణ చేపట్టాలని కోరారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై న్యాయపోరాట ం చేస్తామన్నారు. అవినీతి ఎమ్మెల్యేలు, మంత్రులపై చర్యలు తీసుకోకపోవడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. విభజన హామీలపై కేంద్ర మంత్రులు నోరుమెదపాలని డిమాండ్ చేశారు. మునిసిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, మాజీ చైర్మన్ ముత్యాల చలం, కౌన్సిలర్ నీలం నరసింహారావు, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రభాకర్,యువజన అధ్యక్షుడు షేక్ రఫీ, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.సునీల్‌కుమార్ పాల్గొన్నారు.