అవినీతి అంతస్తులు | Corruption floors | Sakshi
Sakshi News home page

అవినీతి అంతస్తులు

Published Fri, Jun 10 2016 1:16 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

Corruption floors

తిరుపతి కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో   తవ్వేకొద్దీ అక్రమాలే
నిబంధనలు పాటించకుండా నజరానాగా ప్లాట్లు
అంతస్తుకు రూ.లక్ష ఇస్తే  నిర్మాణానికి ఓకే

 

తిరుపతి కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. భవన నిర్మాణ యజమానులతో కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. చట్టంలోని లొసుగులను అనుకూలంగా మలచి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు.  చేయి తడిపితే ఎన్ని అంతస్తులయినా నిర్మించుకోవచ్చుననే భావన భవన నిర్మాణదారుల్లో ఏర్పడింది.  నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలను తొలగించకుండా అధికారులు బేరసారాలకు దిగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అనేక అపార్టుమెంట్‌లలో ప్లానింగ్ అధికారులు అక్రమంగా, బినామీ పేర్లతో బిల్డర్ల నుంచి ప్లాట్లు రాయించుకుంటున్నారనే విమర్శ అవినీతికి పరాకాష్టగా నిలుస్తోంది. ఫలితంగా తిరుపతిలో అక్రమ నిర్మాణాలు కోకొల్లలుగా వెలుస్తున్నాయి.

 

తిరుపతి తుడా: తిరుపతి డీబీఆర్ ఆసుపత్రి రోడ్డు ప్రాంతం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. అక్కడ బడా నేతలు, వ్యాపార వేత్తలు భారీ అంతస్తులను నిర్మిస్తున్నారు. ఇక్కడ నిర్మిస్తున్న అనేక భవనాలకు సరైన అప్రూవల్స్ లేవని తెలిసింది. ఆసుపత్రికి ఆనుకుని నిర్మిస్తున్న భారీ భవనానికి టౌన్ ప్లానింగ్ నుంచి జీ ప్లస్ ఫైవ్ కి అనుమతులు పొందారు. అప్రూవల్‌లో మాత్రం సెల్లార్ చూపించారు. దీంతోపాటు ఐదంతస్తులు మాత్రమే నిర్మిస్తామని రికార్డుల్లో చూపించారు. దీని ప్రకారం అనుమతులు తీసుకుని ఆ తరువాతేమో జీ ప్లస్ సెవన్ భవనాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారు. ఇందుకుగాను ఇదే భవనంలోనే అధికారులు సెటిల్‌మెంట్ చేసుకున్నారని ఆరోపణ ఉంది.

 

ఇది మరో నిదర్శనం
ఇదే రోడ్డులో నిర్మించిన ఓ టవర్స్‌లో భారీ అక్రమాలు జరిగాయి. జీ ప్లస్ ఫైవ్‌కు అనుమతి తీసుకుని జీ ప్లస్ సిక్స్ అపార్డుమెంట్‌ను నిర్మించారు. అపార్డుమెంట్ నిర్మాణంలో ఉండగానే రిజిస్ట్రేషన్‌లు చేపట్టడంతో ముందుగానే అనేక మంది కొనుగోలు చేశారు. ఆరో అంతస్తు నిర్మించడంపై కొనుగోలు దారులు అభ్యంతరం తెలపడంతో ప్లానింగ్ అధికారులు రంగంలోకి దిగారు. తొలగిస్తామని హ్చెరించడంతో ఇక్కడ భారీ సెటిల్‌మెంట్ జరిగిందని తెలిసింది. ఏకంగా ఖరీదైన రెండు ప్లాట్లను బినామీ పేర్లతో అధికారులకు రాసిచ్చారని కొందరు ప్లాట్ కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే నగరంలోని టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతికి అంతులేదు.

 పిర్యాదు చేసినా.. పట్టించుకునేవారేరి...
నిబంధనలు తెలియక సదరు టవర్స్‌లో తాము ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోయాని 2012లో అప్పటి కమిషనర్, తుడా వీసీలకు అపార్టుమెంట్ అసోసియేషన్ నాయకులు ఫిర్యాదు చేశారు. అక్రమంగా నిర్మించిన ఆరో అంతస్తు కారణంగా ప్రమాదంతో పాటు ఇబ్బందిలను కమిషనర్, తుడా వీసీలు గుర్తించి ఆరో అంతస్తును తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. టౌన్‌ప్లానింగ్ అధికారుల ప్లాట్లు ఉండటంతో ఆక్రమణలను తొలగించే సాహసం చేయలేకపోయారని తెలిసింది. రాజకీయ నాయకుల అండతో ఉన్నతాధికారులపైనే ఒత్తిడి తెచ్చారు. ఇప్పటికీ అసోసియేషన్ నాయకులకు బిల్డర్స్, ల్యాండ్ ఓనర్స్ మధ్య వివాదాలు జరుగుతూనే ఉన్నాయి.


కమిషనర్ ఆదేశించినా పట్టించుకోలేదుః
అక్రమాలను వివరాలతోపాటు అప్పటి కమిషనర్ సకలారెడ్డి, తుడా వీసీ పెంచల్‌రెడ్డికి అందజేశాం. ఈ అపార్టుమెంట్ ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని .. ఆరో అంతస్తును తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అయినా తొలగించలేదు. ఫిర్యాదు చేసిన మాపైనే దౌర్జన్యానికి దిగుతున్నారు. ఈ అపార్టుమెంట్‌లో అధికారులకూ ప్లాట్లు ఉన్నాయి. అక్రమాలపై న్యాయపోరాటం చేస్తున్నాం. ఆరో అంతస్తులో రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేయించాం.  - సుబ్రమణ్యంయాదవ్, అడ్వకేట్,  అపార్టుమెంట్ మాజీ అధ్యక్షులు.

 

చర్యలు తీసుకుంటాంః

డీబీఆర్ ఆసుపత్రి రోడ్డులో నిర్మిస్తున్న భవనాన్ని తనిఖీ చేస్తాం. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తుంటే చర్యలు తీసుకుంటాం. కొత్తగా రావడంతో గత కమిషనర్ ఇచ్చిన ఆదేశాల గురించి తెలియదు. అపార్టుమెంట్స్‌లో అధికారులకు ప్లాట్లు ఉన్నాయనడంలో నిజం లేదు. అక్రమ నిర్మాణాలకు పాల్పడుతుంటే అలాంటి వాటిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.  -గుణశేఖర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్, కార్పొరేషన్, తిరుపతి.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement