జిల్లాలో మంగళవారం వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. రాళ్లదెబ్బలకు ముగ్గురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. చెన్నారావుపేట మండలం పుల్లయ్యబోడు తండాకు చెందిన భూక్యా సత్తి వడగండ్ల వర్షం నుంచి తప్పించుకోవడానికి పరుగెత్తుతుండగా ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతిచెందింది.
గూడూరు మండలం మచ్చర్లకు చెందిన పశవుల కాపరి ఆవుల పద్మ, ఊట్ల గ్రామానికి చెందిన లింగాల కొమ్మమ్మ వ్యవసాయ బావుల వద్ద వడగండ్ల దెబ్బకు మృతిచెందారు. చెన్నారావుపేట, నెక్కొండ మండలాల పరిధిలోని చంద్రుగొండ, దీక్షకుంట, సూరిపెల్లి, లింగగిరి
తదితర ప్రాంతాల్లో గొర్రెల మందలు, బర్రెలు పెద్దసంఖ్యలో మృత్యువాతపడ్డాయి. వడగండ్లవానతో పదుల సంఖ్యలో గాయపడినవారు స్థానికంగా చికిత్స పొందుతున్నారు.
పది మందిని మెరుగైన చికిత్స కోసం ఎంజీఎంకు తరలించారు. కాగా, పంటలకు కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. మిర్చి, మొక్కజొన్న, వరి పంటలతో పాటు మామిడితోటలు దెబ్బతిన్నాయి. గాలిదుమారం, వడగండ్ల వర్షం బీభత్సంతో 16 మండలాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గడ్, మద్దూరు, చేర్యాల, నర్మెట, బచ్చన్నపేట, నెక్కొండ, హన్మకొండ, గీసుకొండ, పర్వతగిరి, దుగ్గొండి, చెన్నారావుపేట, గూడూరు, సంగెం, కేసముద్రం, ఆత్మకూరు మండలాల పరిధిలో పంటలు దెబ్బతిన్నాయి. సంగెం మండలం లోహిత, రాంచంద్రపురం, తీగరాజుపల్లి, షాపూర్, కొత్తగూడ, కేసముద్రం మండలం కాట్రపల్లి, అర్వపల్లి, ఉప్పరపల్లి, గూడూరు, చెన్నారావుపేట, నెక్కొండలో భారీ వడగండ్లు పడ్డాయి.
21వేల హెక్టార్లలో వరి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. పలుచోట్ల పూరిళ్ళు, హోర్డింగ్‌లు పడిపోయాయి. ఇటుకబట్టీలు బాగా దెబ్బతిన్నాయి. ఆకస్మికంగా కురిసిన వడగండ్లతో వ్యవసాయ పనులకు వెళ్లిన వారు పలువురు గాయాలపాలయ్యారు. పెద్ద వడగళ్ళు పడడంతో గూడూరు మండలంలో వణికిపోయారు. మోరంచ వాగు పొంగడంతో ధర్మరావుపేట-కొనాపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పంట నష్టంపై వ్యవసాయ, ఉద్యావన శాఖ అధికారులు ప్రాథమిక స్థాయి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.