
సాక్షి, అమరావతి: రాష్ట్ర సర్కారు అప్పులకు కేంద్రం తాత్కాలికంగా కళ్లెం వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరు నెలల్లోనే ఓపెన్ మార్కెట్ నుంచి రూ.16,100 కోట్లను ఆర్థిక శాఖ అప్పు చేసింది. దీంతోపాటు మరో రూ.2,800 కోట్లు విదేశీ ఆర్థిక సంస్థలు, నాబార్డు నుంచి అప్పు చేసింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పులు ఇప్పటివరకు రూ.18,900 కోట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ.23,000 కోట్ల అప్పులను ప్రతిపాదించారు. అయితే ఆరు నెలల వ్యవధిలోనే అప్పులు భారీగా పెరిగాయి. దీనికి అదనంగా మరో రూ.14,646 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చేబదులుగా తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగతా రూ.నాలుగు వేల కోట్ల మేర అప్పు చేసేందుకు అనుమతివ్వాల్సిందిగా రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే కేంద్రం దీన్ని తిరస్కరించింది. ఇప్పటికే 14వ ఆర్థిక సంఘం నిబంధనలకు మించి అప్పులు చేశారని, ఈ నేపథ్యంలో తదుపరి అప్పులకు అనుమతించాలంటే గత రెండు ఆర్థిక సంవత్సరాలతో పాటు ప్రస్తుత ఆర్థిక ఏడాదికి సంబంధించి రాష్ట్ర స్థూల ఉత్పాదకతతోపాటు అప్పుల వివరాలను పంపాలని కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రూ.16,900 కోట్ల మేర అప్పులకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతించింది. ఈ నేపథ్యంలో ఇంకా కేవలం రూ.900 కోట్లు అప్పు చేయటానికే అనుమతి ఉందని, అంతకుమించి తీసుకోవాలనుకుంటే అనుమతిచ్చే వరకు వేచి ఉండాల్సిందేనని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.
ఆస్తుల కల్పనకు రూ.10 వేల కోట్లే
రాష్ట్ర స్థూల ఉత్పాదకతలో 3 శాతానికి మించి అప్పులు చేయరాదని 14వ ఆర్థిక సంఘం నిబంధనలు చెబుతున్నాయి. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం) నిబంధనలు కూడా ఇదే చెబుతున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇటు 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను, ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు మించి అప్పులు చేసింది. ఓపెన్ మార్కెట్ నుంచి ఇప్పటి వరకు రూ.16,100 కోట్లు అప్పు చేయగా అందులో ఆస్తుల కల్పనకు పది వేల కోట్ల రూపాయలే వ్యయం చేసింది. అంటే మరో ఆరు వేల కోట్ల రూపాయలు అనుత్పాదక రంగాలపై వ్యయం చేసినట్లైంది. అప్పులను ఆస్తుల కల్పనకు కాకుండా ఇతర రంగాలకు వ్యయం చేయరాదు. అప్పు చేసిన నిధులను రెవెన్యూ రంగాలకు వెచ్చిస్తే ఆస్తులు తరిగిపోయి అప్పులు పెరిగిపోతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పాదకతను రూ. 7,68,546 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో మూడు శాతం మేర అంటే రూ.23,000 కోట్లు అప్పు చేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
Comments
Please login to add a commentAdd a comment