‘చంచల్‌గూడ’ అధికారులకు సీబీఐ కోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో నిందితుడిగా ఉన్న మాజీమంత్రి మోపిదేవి వెంకట రమణ ఆరోగ్య పరిస్థితిపై ఉస్మానియా లేదా గాంధీ ఆస్పత్రి వైద్యుల నేతృత్వంలోని మెడికల్ బోర్డు నుంచి నివేదిక తీసుకుని సమర్పించాలని సీబీఐ ప్రత్యేకకోర్టు చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. ఈ నెల 12లోగా నివేదిక తమకివ్వాలని తెలిపింది. తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నానని, సర్జరీ చేయించుకోవడానికి 6 నెలల మధ్యంతర బెయిలివ్వాలంటూ మోపిదేవి దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి దుర్గాప్రసాద్‌రావు మంగళవారం విచారించి ఈ ఉత్తర్వులిచ్చారు.
జూన్ 15న తాను తీవ్ర వెన్నునొప్పితో పడిపోవడంతో జైల్లోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక పరీక్షలు చేశారని మోపిదేవి పిటిషన్‌లో తెలిపారు. ‘తల, ఛాతీలో తీవ్రనొప్పి వచ్చింది. కుడి భుజం పనిచేయలేదు. 17న ఉస్మానియా ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ పరీక్ష చేశారు. వెన్నుపూసలు కదిలినట్లు వైద్యులు నిర్ధారించారు. నిమ్స్ వైద్యులు పరీక్షించి సర్జరీ చేయాలని సిఫార్సు చేశారు. సర్జరీ చేయకుంటే శాశ్వతంగా వికలాంగునిగా మారే అవకాశముందన్నారు. సర్జరీ తర్వాత 3 నెలలు విశ్రాంతి అవసరమని చెప్పారు. అందుకే మధ్యంతర బెయిలివ్వండి’ అని మోపిదేవి అభ్యర్థించారు.
మోపిదేవి ఆరోగ్యంపై నివేదిక ఇవ్వండి
Published Wed, Aug 7 2013 5:46 AM | Last Updated on Sat, Jul 6 2019 12:52 PM
Advertisement
Advertisement