కూచిపూడి, న్యూస్‌లైన్ : మొవ్వ మండలం కోసూరులో శుక్రవారం నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమానికి అదనపు జాయింట్ కలెక్టర్ బి.ఎల్.చెన్నకేశవరావు ఆకస్మికంగా రావడంతో అధికారులు హడలిపోయారు. ఏజేసీ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రశ్నించిన తీరు వణుకు పుట్టించింది. ఆయన అంగన్‌వాడీ, రెగ్యులర్ ఎలిమెంటరీ పాఠశాల, రేషన్‌షాపు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. మండల వైద్యాధికారిణి, సూపర్‌వైజర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. సూపర్‌వైజర్ కొన్నింటికి జవాబు చెప్పలేకపోవడంతో ఏజేసీ ఒకింత అసహనానికి గురయ్యారు.
పిల్లలతో మమేకం..
అంగన్‌వాడీ కేంద్రం, ఎలిమెంటరీ పాఠశాల, జిల్లా పరిషత్ హైస్కూల్‌లో పిల్లలతో మమేకమై సమస్యలు తెలుసుకున్నారు. వారిని ఆప్యాయంగా పలుకరించారు. ప్రీస్కూల్, ఎలిమెంటరీ, జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును పరిశీలించారు. జెడ్పీ స్కూల్‌లో వంట ఏజెన్సీ నిర్వాహకులు మార్చి నెల జీతం రాలేదని మొరపెట్టుకోగా.. పరిష్కారం చూపాలని ఎంఈవోను ఆదేశించారు. రుణ అర్హత కార్డులపై పలువురు కౌలు రైతులు గోడు వెళ్లబోసుకోగా దానిపై తహశీల్దార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యసేవలందించడంలో నిర్లక్ష్యం చూపరాదని మండల వైద్యాధికారిణి ఆర్.నాగమౌనికకు సూచించారు.
గ్రామాల్లో ఎంతమంది సీజనల్ వ్యాధుల బారిన పడ్డారో తెలపాలని వైద్య సిబ్బందిని ప్రశ్నించగా వారు తెల్లమొహం వేశారు. గ్రామంలో ప్రాథమిక (ఆర్) పాఠశాల పిల్లల హాజరు తక్కువగా ఉండడాన్ని గుర్తించిన చెన్నకేశవరావు ఎంఈవోను అడిగి డ్రాపవుట్స్‌పై సమాచారాన్ని సేకరించారు. ఎంఈవో, ఉపాధ్యాయులు చెప్పిన సమాధానాలకు పొంతన లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జెడ్పీ హైస్కూల్‌లో శిథిలమైన ఫ్లోరింగ్‌ను బాగుచేసుకోవాలని సూచించారు.
అంతకుముందు అంగన్‌వాడీ కేంద్రంలో తుప్పుపట్టిన ఆట పరికరాలు, పొదలతో భయంకరంగా ఉన్న ఆవరణను పరిశీలించి అధికారులకు క్లాస్ తీసుకున్నారు. గ్రామదర్శిని మండల బృందం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, రేషన్ దుకాణాలు, ఐదు ప్రాథమిక పాఠశాలలు, ఒక జెడ్పీ పాఠశాల, సబ్‌సెంటర్‌ను పరిశీలించింది.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి కె.ఎన్.నాగేశ్వరరావు, ఎంపీడీవో వై.పిచ్చిరెడ్డి, తహశీల్దార్ జి. భద్రుడు, ఐసీడీఎస్ పీవో టి.గాయత్రీదేవి, ఎంఈవో పరసా సోమేశ్వరరావు, ఆర్‌ఐ ఏ శ్రీనివాసరావు, కార్యదర్శి కే పిచ్చయ్య, వీఆర్వో వీర్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.