దండుకో.. దోచుకో | CPDOs In Nellore District Collecting Money Illegally | Sakshi
Sakshi News home page

Published Wed, Apr 11 2018 7:48 AM | Last Updated on Wed, Apr 11 2018 7:49 AM

CPDOs In Nellore District Collecting Money Illegally - Sakshi

సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం:  జిల్లాలో కొందరు సీడీపీఓలు సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. వారిలో కోవూరు నియోజకవర్గంలోని ఓ సీడీపీఓ టాప్‌మోస్ట్‌గా నిలిచిన వైనంపై కథనం. జీతాలు పెరిగినప్పుడు, సమావేశాలకు, జనవరి ఫస్ట్‌ తదితరాలకు ఒక్కో అంగన్‌వాడీ కేంద్రం నుంచి రూ.1000 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కోడిగుడ్లను సరఫరా చేసే కాంట్రాక్టర్లను వదల్లేదు. నెలకు రూ.20వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇలా కమీషన్లకు తమ కార్యాలయాలను అడ్డాగా మార్చుకుని సీడీపీఓలు కొనసాగుతున్నారు.

నియోజకవర్గంలోని సీడీపీఓ టాప్‌మోస్ట్‌
కోవూరు నియోజకవర్గంలోని ఓ సీడీపీఓ టాప్‌మోస్ట్‌ అవినీతి పరురాలిగా సోషల్‌ మీడియాలో, ప్రజల్లో హల్‌చల్‌ జరుగుతోంది. సూపర్‌వైజర్లను మధ్యవర్తులుగా పెట్టుకుని ఈమె చేస్తున్న దందా అంతా ఇంతా కాదు. ప్రతి విషయంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల వద్ద కూడా మామూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. తనకు రాష్ట్రస్థాయిలో పరపతి ఉందని, విచారణ జరిగినా ఎవరూ ఏమీ చేయలేరని బహిరంగంగా చెబుతున్నట్లు సమాచారం.

బయటడినవి కొన్ని మాత్రమే..

  • వెంకటగిరి మండలంలో డక్కిలిలో అంగన్‌వాడీ సరుకులను నిల్వ ఉంచి, అవినీతికి పాల్పడటంతో అక్కడి సీడీపీఓ, సూపర్‌వైజర్‌ను గతంలో సస్పెండ్‌ చేశారు.
  • కోవూరు నియోజకవర్గంలోని రెండు మండలాల్లో ఉన్న సీడీపీఓలు భారీగా అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే అంగన్‌వాడీ కార్యకర్తలు తమ ఉద్యోగాలు ఎక్కడ పోతాయోనన్న భయంతో చెప్పరని ఆయా సీడీపీఓలు భావిస్తున్నారు. కలెక్టర్‌ ముత్యాలరాజు విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటపడుతాయని అంటున్నారు.

సీడీపీఓల బండారంపై ఏసీబీకి ఫిర్యాదు
కోవూరు నియోజకవర్గంలోని అవినీతి సీడీపీఓల భాగోతంపై కొందరు ఏసీబీకి లిఖిత పూర్వక సమాచారంతో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.   

అక్రమ వసూళ్లు
ఉదయగిరి: ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు, ఉదయగిరి ప్రాజెక్ట్‌ల పరిధిలో పనిచేస్తున్న ముఖ్య అధికారులు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల నుంచి అక్రమంగా వసూళ్లు చేస్తున్నారనే విమర్శలున్నాయి. చిన్నారులకు పోషకాహారం సక్రమంగా అందించడంలో శ్రద్ధచూపని అధికారులు మామూళ్ల వసూళ్లపై ఆసక్తి కనపరుస్తున్నారు. నియోజకవర్గంలో 446 అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో సుమారు 900మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ కేంద్రాలకు సంబంధించి టీఏ, డీఏ బిల్లుల్లో, కేంద్రాల అద్దె బిల్లుల చెల్లింపుల్లో ట్రెజరీ పేరుతో పర్సంటేజీలు వసూలుచేస్తున్నారు.

2017లో ఉదయగిరిలో పనిచేసిన సీడీపీఓ అంగన్‌వాడీ కేంద్రాలకు పంపాల్సిన సరుకుల్లో అవకతవకలకు పాల్పడటంతో అప్పటి కలెక్టర్‌ ఆమెను సస్పెండ్‌ చేశారు. ఉదయగిరి ప్రాజెక్ట్‌లో పనిచేసే ఓ సూపర్‌వైజర్‌ కార్యకర్తల నుంచి పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు కార్యకర్తలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను ప్రాజెక్ట్‌ పరిధిలో వేరే మండలంలో బదిలీ చేశారు. అక్కడ కూడా ఆమె వ్యవహార శైలిలో ఎలాంటిమార్పులు రాలేదనే ఆరోపణలున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement