డబ్బులు ఉన్నాయి కదా అని ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ కొనుక్కుంటే సరిపోతుందా? ఛస్తే సరిపోదు. ఆ విషయమే పాపం ఓ ఎన్.ఆర్.ఐ. కి ఆలస్యంగా తెలిసొచ్చింది. ఇపుడు వెనక్కి వెళ్లలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే పార్టీ ఫండ్ కింద కొంత..టికెట్ కోసం కొంత చొప్పున ఈ ఎన్.ఆర్.ఐ. నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు బానే లాగేశారట. విదేశాల్లో సంపాదించుకున్నది జన్మభూమిలో ఉట్టి పుణ్యాన పోగొట్టుకోవలసి వచ్చిందని ఇపుడా నేత భోరు మంటున్నారు. ఎవరా నేత? ఏమా ఏడుపు కథ?
టీడీపీ స్థాపించిన కొత్తలో చాలా మంది డాక్టర్లు, న్యాయవాదులను రాజకీయాల్లోకి తెచ్చారు. వారిలో చాలా మంది తమకున్న అద్భుతమైన ప్రాక్టీసులు వదులుకుని రాజకీయాల్లో అడుగు పెట్టి ఆ తర్వాత ఫెయిల్ అయ్యి రాజకీయాలకూ.. తమ వృత్తులకూ పనికిరాకుండా పోయారు.
ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఎన్.ఆర్.ఐ.లపై పగ బట్టినట్లు కనిపిస్తోంది. ప్రవాస భారతీయులను పిలిచి అరచేతిలో రాజకీయ వైకుంఠం చూపించిన చంద్రబాబు కోట్లకు కోట్లు గుంజి టికెట్లు అంటగట్టారు. రాజకీయాల్లో అదరగొట్టేద్దామని వచ్చిన ఎన్.ఆర్.ఐ.లకు ప్రచారం మొదలైన తర్వాత అసలు పిక్చర్ కనిపిస్తోంది. తాము అనవసరంగా టికెట్లు కొన్నామని వారు చిందులు తొక్కుతున్నారు. అటువంటి కొద్ది మంది అభాగ్యుల్లో ఉదయగిరి అసెంబ్లీ నియోజక వర్గం టికెట్‌ను కోట్లు పోసి కొనుక్కున్న ఎన్.ఆర్.ఐ. కాకర్ల సురేష్ అనవసరంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చానని తన అనుచరులతో చెప్పుకుని పెడబొబ్బలు పెడుతున్నారు.
ఉదయగిరి నియోజకవర్గంలో ఏళ్ల తరబడి టీడీపీ జెండా మోస్తూ వస్తోన్న మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకట రామారావుకు టికెట్ ఇస్తామని చివరి నిముషం దాకా ఊరించిన చంద్రబాబు చివర్లో సూట్ కేసులతో వచ్చిన ఎన్.ఆర్.ఐ. సురేష్‌కు టికెట్ ప్రకటించారు. దీంతో బొలినేని వర్గం ఆగ్రహంగా ఉంది. సురేష్ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కనిపించడంలేదు. సురేష్ ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు బొలిననేని రావడం లేదు. తన వర్గీయులను కూడా వెళ్లద్దని చెబుతున్నారట. నెల్లూరు ఎంపీ అభ్యర్ధి వేమిరెడ్డి ఉదయగిరిలో ప్రచారానికి వచ్చినపుడు సురేష్‌తో కలిసి తిరిగారు. ఎక్కడా జనం లేకపోవడంతో వేమిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
రోజులు గడుస్తోన్న కొద్దీ ఉదయగిరిలో గెలిచే పరిస్థితులు కనపడకపోవడంతో సురేష్‌లో టెన్షన్ మొదలైందంటున్నారు. ఓడిపోయే సీటును ఎందుకు కొనుక్కున్నామా అని కాకర్ల సురేష్ తలపట్టుకుంటున్నారట. ఇపుడు టికెట్ వద్దంటే డబ్బులు వెనక్కి రావు. గోడకి కొట్టిన సున్నంలా టీడీపీకి చదివించుకున్న కోట్ల రూపాయలకు రెక్కలు వచ్చినట్లే.
Comments
Please login to add a commentAdd a comment