గర్భిణులకు అన్యాయం జరిగితే ఊరుకోం
- సీఎం స్పందించకుంటే మా ప్రతాపం చూపుతాం
- జూనియర్ డాక్టర్లకు మద్దతు తెలిసిన సీపీఐ జాతీయ నేత నారాయణ
తిరుపతి అర్బన్: నిరుపేద గర్భిణులకు అన్యాయం జరిగితే తమ పార్టీ చూస్తూ ఊరుకోదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కే.నారాయణ హెచ్చరించారు. 300 పడకల గర్భిణీల భవనాలను మెటర్నిటీకే కేటాయించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు, హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు బుధవారం 15వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా భవన పరిరక్షణ జేఏసీ కన్వీనర్ల ఆధ్యర్యంలో జూ.డాల సంఘం నేతలు, ఇతర నాయకులు రుయా ఎదుట నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు సీపీఐ నారాయణ సంఘీభావం తెలిపారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ ఎస్వీ మెడికల్ కాలేజీకి దశాబ్దాలుగా గుర్తింపు ఉందన్నారు.
అలాంటి కాలేజీ పరిధిలోని ఆస్పత్రులను నిర్వీర్యం చేయాలని చూస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదన్నారు. తిరుపతిలోని ప్రభుత్వ ఆస్పత్రులు ఎలా ఉంటాయి? ఇక్కడికి వచ్చేవారి పరిస్థితులు ఎలా ఉంటాయి? అనే అంశాలపై హైదరాబాద్‌లోని ఒక్క అధికారికైనా అవగాహన ఉందా..! అని ప్రశ్నించారు. ఈ ఆస్పత్రుల ప ట్ల ఏమాత్రం అవగాహన లేనివారే ఇలా ఇష్టమొచ్చిన ట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆందోళన గురించి సీఎంగా చంద్రబాబు ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయకుంటే పోరాటాల పార్టీ ప్రతాపం ఏం టో చూపుతామన్నారు.
తాము కూడా మరింత మొండివైఖరితో ముందుకెళ్లి 300 పడకల భవనాలను ఆక్రమించుకుని మెటర్నిటీ వైద్యులకు అప్పగించాల్సి ఉంటుందన్నారు. ఆస్పత్రి భవనాల విషయంలో స్వి మ్స్ అధికారులు కూడా నిరుపేదలకు న్యాయం జరిగేలా చూడాలని హితవు పలికారు. చివరగా నారాయణ 300 పడకల కొత్త భవనాలను, మెటర్నిటీ హాస్పిటల్‌లోని వార్డులను సందర్శించారు. జూ.డాల నాయకులు నారాయణకు వినతిపత్రం అందజేశారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకయ్య, నగర కార్యదర్శి పెంచలయ్య, కార్యవర్గ సభ్యులు మురళి, రాధాకృష్ణ, ఎన్‌డీ రవి, వెంకటేష్, నరేష్, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విజయలక్ష్మి, కార్యదర్శి శోభ, రత్నమ్మ, పల్లవి, మెడికల్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.