కొత్తగూడెం, న్యూస్‌లైన్: కామ్రేడ్లు కదం తొక్కారు. పోడు భూములపై గిరిజనులకు హక్కులు కల్పించాలంటూ నినదించారు. కొత్తగూడెంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు మూడు వేల మంది ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. మార్కెట్ యార్డు నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా సాగింది. ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న నిరసనకారులు అక్కడ ధర్నా నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిద్ధి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోడు సాగుదారులపై నిర్భందాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
లేదంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో 70 లక్షల ఎకరాల మిగులు భూమి ఉందని, దీనిని నిరుపేదలకు పంపిణీ చేయాలని అన్నారు. కోనేరు కమిటీ సిపారసులను అమలు చేయాలన్నారు. అడ్డూఅదుపు లేకుండా నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ ప్రభుత్వం సామాన్యులపై పెనుభారం వేస్తోందని విమర్శించారు.ప్రజలు సంఘటితంగా ఉద్యమించి హక్కులను సాధించుకోవాలన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ అడవిని నమ్ముకుని బతుకుతున్న గిరిజనులకు పోడు భూములు సాగు చేసుకునే హక్కు ఉందన్నారు. పోడు భూముల్లో సాగుచేసే వారికే హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు చేసే వారిపై అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. దున్నేవాడిదే భూమి అనే నినాదంతో సీపీఐ పోరాడుతోందన్నారు. గిరిజనులను పోడుభూమి నుంచి ఎవ్వరూ విడదీయలేరన్నారు. తుపాకులు పట్టుకుని వచ్చినా గిరిజనులను ఏమీ చేయలేరన్నారు. ఎన్ని కేసులు పెట్టినా పేదవారికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పోలీసులకు, తూటాలకు భయపడేది లేదన్నారు. తెలంగాణ ఏర్పాటును కేంద్ర కేబినేట్ ఆమోదించడం హర్షణీయమన్నారు.
రానున్న ఎన్నికలు ప్రత్యేక రాష్ట్రంలోనే జరుగుతాయన్నారు. వెయ్యి మంది బలిదాలు చేసిన తర్వాతే కాంగ్రెస్‌కు కన్నువిప్పు కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు తెలంగాణ గుర్తుకొచ్చిందని వ్యాఖ్యానించారు. పోరాటాల ద్వారానే తెలంగాణ వచ్చిందని, కాంగ్రెస్ ఇచ్చిందేమీ లేదని అన్నారు. వితంతువులకు, వికలాంగులకు రూ.3 వేలు పింఛన్ అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.కె.సాబీర్‌పాషా, ఏపూరి బ్రహ్మం, దొండపాటి రమేష్, మునీర్, డీసీసీబీ డెరైక్టర్ మండే వీరహనుమంతరావు, బరిగెల సాయిలు, బందెల నర్సయ్య, సలిగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పోడు... పోరు
Published Sat, Oct 5 2013 5:26 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM
Advertisement
Advertisement