సామూహిక సెలవులను ప్రధానోపాధ్యాయునికి ఇస్తున్న ఒక పాఠశాల ఉపాధ్యాయులు
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌పై నిరసన హోరు మిన్నంటుతోంది. దానిని రద్దు చేసేవరకూ ఉద్యమం ఉధృతం చేయాలనే సంకల్పం ఉపాధ్యాయ వర్గాల్లో బలపడుతోంది. ఇప్పటికే జిల్లాలో వివిధ రీతుల్లో చేపట్టిన ఆందోళన సెప్టెంబర్ ఒకటో తేదీన కలెక్టరేట్ ముట్టడితో ఉధృతరూపం దాల్చనుంది.
దీనిపై ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో విస్తృత ప్రచారం చేపట్టడమే గాకుండా... సామూహిక సెలవు పెట్టి ఆందోళనలో పాల్గొనేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే ఇందుకోసం ఆరువేల మంది సెలవుపెట్టినట్టు అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి.
విజయనగరం అర్బన్: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) రద్దు పోరును ఉధృతం చేసేందు కు ఉపాధ్యాయ వర్గాలు సమాయత్తం అవుతున్నా యి. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక(ఫ్యాప్టో) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కొన్ని నెలలుగా జిల్లాలోని ఉపాధ్యాయుల్లో సీపీఎస్ రద్దు ఉద్యమంపై చైతన్యం పెరిగింది. మండల కేంద్రాల్లో ర్యాలీలు, జిల్లా వ్యాప్తంగా పోరుజాత, ప్రధాన పట్టణాల్లో బహిరంగ సభలు ఒకటేమిటి విభిన్న రీతిలో నిరసనలు తెలుపుతూ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తడి తెస్తున్నారు. సీసీఎస్ రద్దు నిరసనలు అంటేనే పాలకులు భయపడుతున్నారు.
విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహణ కోసం ఇచ్చిన పిలుపుతో ప్రభుత్వం ఉలిక్కిపడి ఉద్యమ జిల్లా స్థాయి నాయకులను జిల్లా దాటనీయకుండా హౌస్ అరెస్టులను చేయించారు. తాజాగా వచ్చేనెల 1వ తేదీన జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి ఇచ్చిన పిలుపుతో జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో హాజరు కావాలని ఉపాధ్యాయులంతా ఇప్పుడు సామూహిక సెలవులకు అర్జీలు చేశారు.
కలెక్టరేట్ ముట్టడికి సామూహిక సెలవుల అస్త్రం
ఫ్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు కలెక్టరేట్ ముట్టడి విజయవంతం చేసేందుకు ఉపాధ్యాయ వర్గాలు సామూహిక సెలవుల అస్త్రం ప్రయోగిస్తున్నాయి. దీనిపై మండలాలు, గ్రామాల వారీగా ప్రచారం ఊపందుకోవడంతో సామూహిక సెలవులకు సిద్ధమైన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వారం రోజుల క్రితం నుంచే క్యాజువల్ లీవ్‌లను పెట్టడం మొదలు పట్టారు.
జిల్లా వ్యాప్తంగా వివిధ కేడర్ ఉపాధ్యాయ, ప్రధానోపాధ్యాయులు 14 వేల వరకు ఉండగా గురువారం నాటికి ఆరువేల మంది సామూహిక సెలవులు పెట్టినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఒక రోజున సరాసరిన 700 మందికి మించి సెలవులు పెట్టే పరిస్థితి జిల్లాలో ఎప్పుడూ రాలేదు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ వర్గంలో సీపీఎస్ రద్దు లక్ష్య సాధన ఏ మేరకు ఉందో స్పష్టమవుతోంది. క్యాజువల్ లీవులు ఇవ్వడానికి కొన్ని మండలాల్లో విద్యాశాఖ అధికారులు ఇష్టపడటం లేదని, ఆలాంటి మండలాలకు సంఘాల ప్రతినిధులు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తూ ఉద్యమాన్ని మరింత పటిష్ట పరుస్తున్నట్లు తెలుస్తోంది.
ఆదినుంచి శాంతియుత ఉద్యమాలే..!
ఉపాధ్యాయ సంఘాలతో ఏర్పడిన ఐక్యవేదిక(ఫ్యాప్టో) ఆవిర్భావం మొదట్లో సీపీఎస్ బాధితుల సమస్యలపై విస్తృత స్థాయిలో సమీక్షించింది. దాని ప్రభావ తీవ్రతను గుర్తించి రద్దు చేయడమే ఒక్కటే పరిష్కారమార్గమంటూ నిర్ణయించింది. అందుకు రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు సిద్ధంగా లేకపోవడంతో ఇక ఉద్యమ బాట పట్టింది. ఇంతవరకు చేసిన ఉద్యమాల ప్రభావాన్ని ప్రభుత్వం గుర్తించిందో లేదో తెలియదు గానీ సీపీఎస్ రద్దు లక్ష్యం ఉపాధ్యాయుల నరనరాల్లో జీర్ణించుకుపోయినట్లు ఉద్యమ నేపథ్యం తెలియజేస్తోంది.
ఇంతవరకు చేపట్టిన ప్రధాన నిరసన కార్యక్రమాలు...
- ఫ్యాప్టో ఆధ్వర్యంలో 2017 అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా తాలూకా స్థాయి ధర్నాల పిలుపు నేపథ్యంలో జిల్లాలోని అన్ని తాలూకా కేంద్రాల్లో నిర్వహించారు.
- నవంబర్ 15న చలో అసెంబ్లీ. జిల్లా నుంచి విజయవాడకు 500 మంది హాజరయితే 300 మందిని ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆ అరెస్టులకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా నిరసనలు.
- వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహనరెడ్డి పాదయాత్రలో సీపీఎస్ బాధితులు కలవడం... ఆయన రద్దు చేస్తానని ప్రకటించడంతో ఉద్యమానికి కొండంత బలం వచ్చింది.
- 2018 జూలై 30, 31 తేదీల్లో జిల్లాలో పోరుయాత్ర చేపట్టారు. పార్వతీపురం నుంచి కొత్తవలస వరకు ఈ నిరసన యాత్ర సాగింది. పట్టణంలో కోట జంక్షన్ వద్ద బహిరంగ సభ జరిగింది.
- ఆగస్టు 11న చలో విజయవాడ – జింఖానా గ్రౌండ్స్‌లో బహిరంగసభ – జిల్లా నుంచి 1,000 మంది హాజరు. ∙ సెప్టెంబర్ ఒకటిన కలెక్టరేట్ ముట్టడి. మాస్ క్యాజువల్ లీవులు పెట్టిన ఉపాధ్యాయులు ఇప్పటికే 6 వేల మంది. ముట్టడికి ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక మద్దతు.
సీపీఎస్ రద్దు బాధ్యత రాష్ట్రప్రభుత్వానిదే
రాష్ట్రంలో అమలవుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సీపీఎస్ విధానం రద్దు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీపీఎస్ రద్దు కేంద్రప్రభుత్వం పరిధిలో ఉందని చెప్పడం ఆయన బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కులను హరించడంలో భాగంగానే సీపీఎస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. రద్దు చేసే వరకు ఉద్యమాలు ఆగవు.
– కె.శేషగిరి, జిల్లా చైర్మన్, ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment