బ్రేకుల్లేని ట్రావెల్స్‌ దందా.. | Crackdown on private travel buses continues in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

బ్రేకుల్లేని ట్రావెల్స్‌ దందా..

Published Wed, Mar 1 2017 8:34 AM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM

బ్రేకుల్లేని ట్రావెల్స్‌ దందా..

బ్రేకుల్లేని ట్రావెల్స్‌ దందా..

మాఫియా మాదిరి మారిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌
నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తిరుగుతున్న బస్సులు
అధికార పార్టీ నేతలే ట్రావెల్స్‌ యాజమాన్యాలు
అందుకే పట్టించుకోని ప్రభుత్వం, రవాణా శాఖ
అరుణాచల్‌ ప్రదేశ్, పుదుచ్చేరిల్లో రిజిస్ట్రేషన్‌


సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్‌ మాఫియా ఆగడాలు రోజు రోజుకూ పెచ్చుమీరిపోతున్నాయి. ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టి ట్రావెల్స్‌ నిర్వాహకులు బస్సుల్ని తిప్పుతున్నా.. ప్రభుత్వం వారిపై చర్యలకు వెనుకాడుతోంది. ప్రైవేటు ట్రావెల్స్‌ నడుపుతోంది.. అధికార పార్టీకి చెందిన ఎంపీలే కావడమే దానికి కారణం. ఒకవేళ రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నా.. వారికి సర్కారు బదిలీల బహుమానం అందిస్తోంది. ఐదేళ్లుగా నిత్యం ఏదో ఒక చోట ప్రైవేటు ట్రావెల్స్‌ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఘోర ప్రమాదం జరిగి ప్రయాణికులు దుర్మరణం పాలయితే ఓ కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప ప్రైవేటు ట్రావెల్స్‌ దూకుడుకు అడ్డుకట్ట వేయడం లేదు.  

కాంట్రాక్టు క్యారేజీ అనుమతులతో..
కాంట్రాక్టు క్యారేజీ అనుమతులతో స్టేజి క్యారియర్లుగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ మాఫియా తెలుగు రాష్ట్రాల్లో బస్సుల్ని తిప్పుతోంది. ఇతర రాష్ట్రాల్లో ఆలిండియా పర్మిట్లు పొంది నిబంధనలకు విరుద్ధంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తిప్పుతున్నారు. మొత్తం 500 ప్రైవేటు బస్సులు ఇలా తిరుగుతున్నాయనేది అంచనా. కేంద్ర మోటారు వాహన చట్టం–1989 నిబంధనలను అతిక్రమించి తిప్పుతున్న ఈ బస్సుల జోలికి వెళ్లవద్దంటూ సాక్షాత్తూ ఓ మంత్రి రవాణా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రయాణికుల భద్రతను సవాల్‌ చేస్తూ ప్రైవేటు ట్రావెల్స్‌ ఏకంగా టూ ప్లస్‌ వన్‌ బెర్తులతో తిప్పుతున్నా.. రవాణా శాఖ చోద్యం చూడటం మినహా ఏ ఒక్క బస్సును సీజ్‌ చేయట్లేదు. విజయవాడ బందరు రోడ్డు రవాణా శాఖ కమిషనర్‌ కార్యాలయానికి కూత వేటు దూరంలో.. మెయిన్‌ రోడ్డు మీదే దాదాపు 200 ట్రావెల్స్‌ బస్సులు నిలిపి స్టేజీ క్యారియర్లుగా ప్రయాణికులను ఎక్కించుకోవడం రోజూ కనిపించే దృశ్యం. అయినా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడానికి పైనుంచి వచ్చే ఒత్తిళ్లే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పర్యాటక రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు
టూరిజాన్ని ప్రోత్సహిస్తున్న అరుణాచల్‌ ప్రదేశ్, పాండిచ్చేరిలలో రవాణా శాఖ ట్యాక్స్‌లు చాలా తక్కువగా ఉంటాయి. ఏడాదికి ఒక బస్సుకు రూ. 17 వేలు చెల్లించి ఆలిండియా పర్మిట్‌ పొందవచ్చు. అదే తెలుగు రాష్ట్రాల్లో పర్మిట్లు పొందాలంటే మూడు నెలలకోసారి బస్సులో ఒక్కో సీటుకు ఏపీలో అయితే రూ. 3,750, తెలంగాణలో రూ. 3,675 చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు ట్రావెల్స్‌ తమ బస్సుల్ని అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నారు.

నిజానికి అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించి పర్మిట్‌ పొందాలంటే ఆ రాష్ట్రం మీదుగాకానీ, ఆ రాష్ట్రంలోగానీ బస్సులు తిరగాలి. కానీ ప్రైవేటు ట్రావెల్స్‌ ఆ పర్మిట్లతో ఏపీ, హైదరాబాద్‌ల నుంచి.. షిర్డీ, బెంగళూరు, చెన్నై, భువనేశ్వర్‌ తదితర ప్రాంతాలకు బస్సుల్ని తిప్పుతున్నారు. అక్రమ బస్సులపై ఎన్‌ఫోర్సుమెంట్‌ తనిఖీలు చేయాలని రవాణా శాఖను ఆదేశిస్తామని ఆశాఖ మంత్రి ప్రకటనలు దండగలా మారాయని ఆరోపణలు ఉన్నాయి.

గత ఐదేళ్లులో ఘోర బస్సు ప్రమాదాలు..

  • 2017 ఫిబ్రవరి 28న భువనేశ్వర్‌ నుంచి హైదరాబాద్‌ వెళుతున్న దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు కృష్ణా జిల్లా ముండ్లపాడు వద్ద ప్రమాదానికి గురై  10 మంది మృత్యువాత పడ్డారు.
  • 2016 సెప్టెంబర్‌ 16న హైదరాబాద్‌ నుంచి షిర్డీ వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ స్లీపర్‌ బస్సు కర్ణాటక దగ్గర హుమ్నాబాద్‌ వద్ద తగులబడి పోయింది. ఈ మంటల్లో చిక్కుకుని తణుకు ప్రాంతానికి చెందిన మూడేళ్ల చిన్నారి విహాన్‌ సజీవ దహనమయ్యాడు. అనుమతి లేని, సురక్షితం కాని స్లీపర్‌ బస్సులో ప్రయాణించడం వల్లే ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు క్షతగాత్రులయ్యారు.
  • 2013 అక్టోబర్‌ 30న బెంగళూరు–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోట మండలంలోని పాలెం గ్రామం వద్ద వోల్వో బస్సు ప్రమాదానికి గురై 45 మంది సజీవదహనమయ్యారు.
  • 2012 జూన్‌ 16న షోలాపూర్‌–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై షిర్డీ వెళుతున్న కాళేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడి 32 మంది భక్తులు మరణించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement