మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాన్ని ఇంకా మరువక ముందే విజయనగరం జిల్లాలో అమావాస్య పూట దారుణం జరిగిపోయింది.
మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాన్ని ఇంకా మరువక ముందే విజయనగరం జిల్లాలో అమావాస్య పూట దారుణం జరిగిపోయింది. మృతుల సంఖ్య ఎంత ఉంటుందో కూడా ఊహించడానికి అవకాశం లేకుండా పోయింది. రాత్రి 9.30 గంటల వరకు సుమారు 18 మంది మరణించి ఉంటారని అధికారులు అంటున్నారు. ఈ ప్రమాదానికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటే విభ్రాంతికర వాస్తవాలు బయటపడుతున్నాయి. బొకారో ఎక్స్ ప్రెస్ లో కొంతమంది అనధికారికంగా బాణాసంచా తీసుకెళ్తున్నారని, దానివల్ల ఎస్1 బోగీలోంచి పొగలు రావడం లేదా మంటలు రేగడం చూసి కలకలం రేగిందని కొందరు ప్రయాణికులు అంటున్నారు. అయితే, దీన్ని అధికారులు ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. ప్రధానంగా ఎస్1 బోగీలోనే మంటలు లేదా పొగ వచ్చాయని, దాని పక్కనే ఉన్న ఎస్2లో నుంచి కూడా కొంతమంది కలకలం వల్ల దూకి ఉంటారని భావిస్తున్నారు.
పొగను చూడగానే అప్రమత్తమైన ప్రయాణికులు ఎవరైనా చైన్ లాగి ఉండొచ్చని అంటున్నారు. ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా వెంటనే స్లో అవుతున్న రైల్లోంచి చాలామంది కిందకి దూకేశారు. అయితే అప్పటికే రాత్రి 7.15 గంటలు కావడం, శివారు ప్రాంతాలు కావడంతో అసలు లైటింగ్ ఏమాత్రం లేకపోవడం వల్ల ఎదురుగా వస్తున్న రాయగడ్ ప్యాసింజర్ వారికి కనిపించలేదు. అది శరవేగంగా వచ్చి దాదాపు 18 మంది ప్రాణాలు బలిగొంది.