ఒకే గుంతలో 17 మృతదేహాలు ఖననం | Crematorium Shortage in Prakasam District Villages | Sakshi
Sakshi News home page

ఆరడుగుల మరణం

Jan 9 2020 1:23 PM | Updated on Jan 9 2020 1:23 PM

Crematorium Shortage in Prakasam District Villages - Sakshi

పాఠశాల ఆవరణలో దహన కార్యక్రమాలు చేసిన స్థలం

మనిషి బతికినన్నాళ్లూ కష్టాలు..కన్నీళ్లే! కొందరు డబ్బు కోసం ఆరాటం. మరికొందరికి అనారోగ్యం..పేదరికం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరి సమస్యలు వారివి. ఈ బాధలు ఎలాగూ తప్పవు. అయితే చివరి మజిలీలో కూడా చనిపోయిన వారి బంధువులకు ప్రశాంతత ఉండటంలేదు. శవాలను పూడ్చటాని ఆరడుగుల స్థలం కూడా దొరక్క.. ఏం చేయాలో తెలియక మృతదేహాలను వెంటే ఉంచుకొని ఉరుకులు.. పరుగులు పెట్టాల్సి వస్తోంది.

ప్రకాశం, యర్రగొండపాలెం: కుటుంబంలో ఎవరైనా మృతి చెందితే ఆ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోతారు. నెమ్మదిగా తేరుకొని మృతదేహాన్ని ఎక్కడ ఖననమో లేదా దహనమో చేయాలన్న ఆలోచనలో పడిపోతారు. అయితే గ్రామాల్లో శ్మశాన వాటికలు లేనవారు అప్పటికప్పుడు స్థలాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో 1038 పంచాయతీలను కలుపుకొని మొత్తం 4,686 గ్రామాలున్నాయి. గతంలో పంచాయతీకి ఒకటి ప్రకారం ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో శ్మశానాలు అభివృద్ధి పరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. అందుకుగాను రూ 67.84 కోట్లు కేటాయించారు. ఒక్కొక్క శ్మశానం అభివృద్ధికి రూ 6.60 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది. ఆ నిధులతో ముఖద్వారం, స్నానాలగది, దహనం చేయటానికి ఒక ప్లాట్‌ఫాం వంటి నిర్మాణాలకు ఖర్చుపెట్టాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వ కాలంలో ఈ శ్మశాన వాటికల నిర్మాణాలు పూర్తిగా పచ్చనేతల కనుసన్నల్లోనే జరిగాయి. వారు డబ్బులు దండుకున్నారేతప్ప పూర్తిస్థాయిలో నిర్మించలేదు. అనేక ప్రాంతాల్లో అర్ధాంతరంగా నిర్మాణాలు నిలిపి వేశారు.

భయం గుప్పెట్లో చిన్నారులు
పెద్దారవీడు మండలంలోని మద్దెలకట్టలో శ్మాశానాలు లేకపోవడం వలన జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల మధ్య రోడ్డుకు సమీపంలో దహన సంస్కరణలు చేస్తున్నారు. అక్కడ చెట్లు నీడ ఉంటుంది. ఈ నీడను ఆసరగా తీసుకొని మృతదేహాలను దహనం చేయడం, ఇతర కర్మకాండలు చేస్తున్నారు. గ్రామంలో ఎవరైనా మృతి చెందితే ఆ రోజు పిల్లలు పాఠశాలకు వెళ్లలేకపోతున్నారు. దహన కార్యక్రమాలు చూసి అనేకమంది చిన్నారులు భయపడిన సంఘటనలున్నాయని గ్రామస్తులు తెలిపారు. 

కుళ్లిపోయిన శవాలు
2010లో పెద్దదోర్నాల మండలంలోని చిన్నదోర్నాల గ్రామానికి చెందిన కొంతమంది కూలీలు వరికోతల కోసం గుంటూరు జిల్లా మాచర్లకు వెళ్లారు. అక్కడ పనులు ముగించుకొని తిరిగి స్వగ్రామానికి చేరటానికి సిమెంటులోడుతో ఉన్న లారీ ఎక్కారు. మార్గమధ్యంలో లారీ బోల్తాపడటంటో ఆ గ్రామానికి చెందిన 17 మంది మృతి చెందారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ప్రజాసంఘాలు శవాలను గ్రామంలోనే ఉంచి ఆందోళన చేపట్టాయి. మూడు రోజులపాటు శవాలు ఖననం చేయకపోవడంతో అవి కుళ్లి దుర్గంధం వ్యాపించింది. అయితే సమస్య పరిష్కారం అయినతరువాత ఆ మృతదేహాలను ఖననం చేయటానికి శ్మశానవాటికలేకుండా పోయింది. దీంతో ఒకే చోట జేసీబీతో పెద్దగుంత తీయించి 17 శవాలను ఒకే చోట ఖననం చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే నాటి ప్రభుత్వం శ్మశానం కోసం ఎకర స్థలాన్ని కేటాయించింది. అయిప్పటికీ ఆ స్థలానికి రక్షణలేకుండా పోయింది. 

పంట పొలాలుగా మార్చుకున్నారు
త్రిపురాంతకం మండలంలోని సోమేపల్లి గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటికతోపాటు సమీపంలో ఉన్న చెక్‌డ్యాంను సైతం కొందరు ఆక్రమించుకొని పంట పొలాలుగా మార్చుకున్నారు. ఈ గ్రామంలోని వాగు పోరంబోకు భూమి 43.35 ఎకరాలు ఉంది. దీనిని గ్రామస్తులు శ్మశాన వాటిక కింద, పశువులమేత బీడుకింద ఉపయోగించుకుంటున్నారు. అయితే కొంతమంది ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునే క్రమంలో శ్మశాన వాటిక కింద వదలి పెట్టిన భూమిని, అక్కడే ఉన్న చెక్‌ డ్యాంను సైతం ఆక్రమించు కొని పంటలను వేసుకుంటున్నా అధికారుల్లో చలనం కనిపించడంలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement