ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై నేరాల సంఖ్యకు అడ్డుకట్ట పడడం లేదు. దేశ సగటును మించి రాష్ట్రంలో మహిళలపై నేరాలు జరుగుతుండడం గమనార్హం. దేశంలో ప్రతి లక్ష మంది మహిళల్లో 55 మందిపై నేరాలు జరుగుతుండగా, ఏపీలో మాత్రం ప్రతి లక్ష మంది మహిళల్లో 65 మందిపై అఘాయిత్యాలు, అరాచకాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో మహిళపై ప్రధానంగా అత్యాచారాలు, లైంగిక వేధింపులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బిహార్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాల కంటే ఏపీలోనే మహిళలపై నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ చేదునిజం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలతో ‘నీతి ఆయోగ్’ నిర్వహించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సమీక్షలో వెల్లడైంది.
ఏపీలో 65 శాతం మందికే వంట గ్యాస్ కనెక్షన్లు
నాగాలాండ్‌లో అతి తక్కువగా ప్రతి లక్ష మంది మహిళల్లో పది మందిపైన నేరాలు జరుగుతున్నట్లు బహిర్గతమైంది. బిహార్‌లో ప్రతి లక్ష మంది మహిళల్లో 25 మందిపై నేరాలు చోటుచేసుకుంటున్నాయి. మేఘాలయ, ఉత్తరాఖండ్‌లో ప్రతి లక్షల మంది మహిళల్లో 30 మందిపై నేరాలు జరుగుతుండగా, జార్ఖండ్‌లో 35 మందిపై నేరాలు జరుగుతున్నట్లు నీతి ఆయోగ్ సుస్థిర అభివృద్థి లక్ష్యాల డాక్యుమెంట్‌లో వెల్లడించింది. వివిధ రంగాల్లో రాష్ట్రాలు ఏ స్థితిలో ఉన్నాయనే విషయాన్ని నీతి ఆయోగ్ వివరించింది. దీని ప్రకారం...
- గ్రామీణ ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా చూస్తే 70.91 శాతం మందికి రక్షిత మంచినీటి సౌకర్యం అందుబాటులో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో 65 శాతం మందికి మాత్రమే రక్షిత మంచినీటి సౌకర్యం ఉంది. మిగతా 35 శాతం జనాభాకు ఈ సౌకర్యం లేదు. గుజరాత్, గోవా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో నూరు శాతం జనాభాకు రక్షిత మంచినీటి సౌకర్యం ఉంది. ఉత్తరప్రదేశ్‌లో 99 శాతం జనాభాకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.
- ఆంధ్రప్రదేశ్‌లో 65 శాతం మందికే వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇంకా 35 శాతం మందికి వంట గ్యాస్ కనెక్షన్లకు దూరంగా ఉన్నారు. ఢిల్లీలో 100 శాతం మందికి, చండీగఢ్‌లో 95 శాతం మందికి వంట గ్యాస్ సౌకర్యం ఉంది.
- ప్రాథమిక పాఠశాలల్లో పిల్లల చేరిక దేశవ్యాప్తంగా 87.3 శాతం ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇది 80 శాతంగా ఉంది.
- దేశంలో సబ్సిడీపై ఆహార ధాన్యాలు 59 శాతం మందికి అందుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో 55 శాతం మందికి అందుతున్నాయి.
- ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది పురుషుల్లో 645 మందికి పని లభిస్తోంది. ప్రతి 1,000 మంది మహిళల్లో 560 మందికి పని లభిస్తోంది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది పురుషుల్లో 450 మందికి, ప్రతి 1,000 మంది మహిళల్లో కేవలం 175 మందికే పని లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment