జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేయడంతో పాటు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ తెలిపారు.
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేయడంతో పాటు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ తెలిపారు. నెల్లూరులోని తన క్యాంప్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జూలైలో పంచాయతీ ఎన్నికలు, ఆగస్టు 1 నుంచి సమైక్య ఉద్యమ బందోబస్తులో సిబ్బంది నిమగ్నమయ్యారన్నారు.
ఈక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. ఇటీవల జిల్లాలో అక్కడక్కడా ఇళ్లలో చోరీలు, చైన్‌స్నాచింగ్‌లు, దోపీడీలు జరిగాయని, వాటిని అరికట్టేందుకు సిటీ డీఎస్పీ నేతృత్వంలో సీసీఎస్, నగర పోలీసులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. వాహన తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టామన్నారు. ఈ చర్యల కారణంగా నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు చైన్‌స్నాచింగ్‌లు జరిగిన సమయంలో బాధితులు వెంటనే తేరుకుని దుండగుడి పోలికలు, ఉపయోగించిన బైక్, నంబర్‌ను 100కు తెలియజేయాలన్నారు.
నకిలీ మీడియా ఆటకట్టిస్తాం
మీడియా ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న నకిలీల ఆటకట్టించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ ప్రకటించారు. ఇటీవల కొందరు మీడియా ప్రతినిధులమంటూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వారి కదలికలపై ఇప్పటికే నిఘా పెట్టామన్నారు. ఇలాంటి వారి గుట్టును త్వరలోనే రట్టు చేస్తామని చెప్పారు. ఎక్కువమంది వాహనాలకు ప్రెస్‌స్టిక్కర్లు వేసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలిసిందన్నారు.
ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వ గుర్తింపు పొందిన, సంబంధిత పత్రిక, చానల్ యాజమాన్యం ధ్రువీకరించిన జర్నలిస్టులందరికీ త్వరలో పోలీసు స్టిక్కర్లు అందజేస్తామన్నారు. మీడియాతో సంబంధం లేని వారు వాహనాలపై ప్రెస్‌స్టిక్కర్లు వేసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో నగర డీఎస్పీ పి. వెంకటనాథ్‌రెడ్డి, ఎస్‌బీ, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు వై.జయరామసుబ్బారెడ్డి, ఎస్‌కె బాజీజాన్‌సైదా, ఒకటి, ఐదో నగర సీఐలు మద్ది శ్రీనివాసులు, ఎస్వీ రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎవరి పని వారు చేయండి
‘ఎవరి పని వారు చేయండి..తప్పించుకునేందుకు పై అధికారులపై నెట్టేస్తే సహించేది లేదు’ అని సిబ్బందిని ఎస్పీ రామకృష్ణ హెచ్చరించారు. జిల్లాలోని పోలీసులతో ఆయన సెట్‌లో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారం కాని పక్షంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, అలా కాకుండా ప్రతి విషయాన్ని వారిపైకి నెట్టడం తగదన్నారు. విధి నిర్వహణలో అలసత్వంగా వ్యవహరించే సీఐలపై తనకు నివేదిక ఇవ్వడంతో పాటు ఎస్సైలకు చార్జిమెమోలు ఇవ్వాలని డీఎస్పీలను ఆదేశించారు. గూడూరు సబ్‌డివిజన్‌లో ప్రతి విషయాన్ని డీఎస్పీపై రుద్దేప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారికి వెంటనే చార్జి మెమోలు ఇవ్వాలని చౌడేశ్వరిని ఆదేశించారు.