
ప్రవీణ్‌కుమార్ మృతదేహం ప్రవీణ్‌కుమార్ (ఫైల్)
ప్రకాశం,రాచర్ల: మండలంలోని గౌతవరం గ్రామానికి చెందిన చట్టి దుర్గా ప్రసాద్, రంగలక్ష్మమ్మ దంపతుల ఏకైక కుమారుడు ప్రవీణ్‌కుమార్ (22) సీఆర్‌పీఎఫ్ జవాన్‌గా పని చేస్తూ ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ప్రవీణ్‌కుమార్ అంత్యక్రియలు సోమవారం అధికార లాంఛనాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రవీణ్ గిద్దలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిగ్రీ చదువుతూ ఏడాది క్రితం హైదరాబాద్‌లో జరిగిన సీఆర్‌పీఎఫ్ సెలక్షన్స్‌కు వెళ్లాడు. ఎంపిక అనంతరం శిక్షణ కోసం కేరాళ రాష్ట్రంలో ఏడాది పాటు ఉన్నాడు.
అక్కడి నుండి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి పోస్టింగ్ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లో ఆరు నెలలు విధుల్లో పనిచేసి సెలవుల్లో స్వగ్రామం గౌతవరం గ్రామానికి వచ్చి వినాయక చవితి, పీర్ల పండగులను కుటుంబ సభ్యులతో సంతోషాంగా గడిపి సెలవు పూర్తిగా కాగానే ఈ నెల 15వ తేదీన ఛత్తీస్‌గఢ్ వెళ్లి విధుల్లో చేరాడు. రోజూ తల్లిదండ్రులతో ఫొన్‌లో మాట్లాడే వాడు. తోటి సీఆర్‌పీఎఫ్ జవానులతో కలిసి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజపూర్ జిల్లాలో తనిఖీకి వెళ్లివస్తుండగా సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న మైన్‌ప్రూఫ్ వాహనాన్ని శక్తివంతమైన మందుపాతరతో మావోయిస్టులు పేల్చివేయడంతో సంఘటన స్థలం వద్దనే ప్రవీణ్‌కుమార్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తల్లి రంగలక్ష్మమ్మ తన కుమారుడు ఇక లేడనే వార్త విన్నప్పుటి నుంచి తీవ్ర అస్వస్థతకు గురై ఆనారోగ్య బారిన పడింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తూనే ఉన్నారు.
పెద్ద దిక్కు కోల్పోయా..
దుర్గా ప్రసాద్‌ది నిరుపెద కుటుంబం. ఆయనకు కుమారుడు, కూమార్తె ఉన్నారు. పెద్ద కుమార్తె దుర్గా భారతి చిన్నతనంలో రెండు చేతులకు పోలియో వచ్చింది. దుర్గా ప్రసాద్ వ్యవసాయ పొలాల్లో కూలి పనులు చేసుకుంటూ ప్రవీణ్‌కుమార్‌కు డిగ్రీ వరకూ చదివించారు. హైదరాబాద్‌లో జరిగే సీఆర్‌పీఎఫ్ సెలక్షన్స్‌కు పంపించారు. కుమారుడికి ఉద్యోగం వచ్చిందని ఎంతో సంతోషంగా ఉన్న సమయంలోనే మావోయిస్టులు పేట్టిన మందుపాతలో ప్రాణాలు కోల్పోయాడు.
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
గౌతవరంలో సోమవారం అధికార లంఛనాలతో ప్రవీణ్‌కుమార్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ ఎలిజబెత్‌రాణి, ఎస్‌ఐ నాగశ్రీను తెలిపారు. ఆదివారం అంత్యక్రియలు చేసే ప్రదేశంలో పూర్తి ఏర్పాటు చేశారు. అంత్యక్రియలకు కలెక్టర్ వినయ్‌చంద్, ఎస్పీ సత్యఏసుబాబు హాజరు కానున్నట్లు అధికారులు
వివరించారు.