విజయనగరం: పట్టణంలో శుక్రవారం కర్ఫ్యూను సడలించనున్నారు. రేపు ఉదయం 7 గం.ల నుంచి సాయంత్రం 4.గం.ల వరకూ కర్ఫ్యూను సడలిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. కాగా, కర్ఫ్యూ సడలింపు సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ కార్తికేయ తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో విజయనగరంలో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఆదివారం నుంచి కర్ఫ్యూ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.
విజయనగరం పట్టణంలో నాల్గోరోజూ కర్ఫ్యూ కొనసాగింది. కొద్దిరోజుల క్రితం వరకూ అట్టుడికిపోయిన పట్టణంలో ఇప్పుడు నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. బుధవారం ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోలేదు. దీంతో గురువారం నాలుగు గంటల పాటు కర్ఫ్యూను సడలిస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం ఉండటంతో శుక్రవారం తొమ్మిది గంటల పాటు కర్ఫ్యూను సడలించనున్నారు.
మంగళవారం రాత్రి పలు సమస్యాత్మక ప్రాంతాలు, ప్రధాన కూడళ్లను అనుసంధానం చేస్తూ పోలీసులు ఏర్పాటు చేసిన ముళ్ల కంచె కారణంగా సంచరించేందుకు ఎవరూ సాహసించలేకపోయారు. పట్టణంలో ప్రత్యేక బలగాలు పలుమార్లు కవాతు నిర్వహించి పరిస్థితని చక్కదిద్దేందకు యత్నిస్తున్నాయి.