సైబర్ నేరాలు జిల్లాలో ప్రతిరోజూ ఏదో ఒకచోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. దీనికి అడ్డుకట్ట వేయడంలో జిల్లా పోలీసు యంత్రాంగం విఫలం కావడం వల్లే నేరస్తుల హవా కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఖమ్మం మయూరిసెంటర్, న్యూస్‌లైన్: సైబర్ నేరాలు జిల్లాలో ప్రతిరోజూ ఏదో ఒకచోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. దీనికి అడ్డుకట్ట వేయడంలో జిల్లా పోలీసు యంత్రాంగం విఫలం కావడం వల్లే నేరస్తుల హవా కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖాతాదారులకు ఇబ్బంది లేకుండా ఎక్కడైనా డబ్బు తీసుకునేందుకు వీలుగా బ్యాంకులు ప్రవేశపెట్టిన ఏటీఎం సౌకర్యం నేరస్తుల పాలిట వరంగా మారింది. జలసాలకు అలవాటు పడిన పలువురు తమకున్న ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని ఇలా అడ్డదారి పట్టిస్తున్నారు. ఖాతాదారులకు తెలియకుండానే లక్షల రూపాయలు డ్రా చేసి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఉన్నట్టుండి తమ ఖాతాలో డబ్బు మాయం కావడంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. బ్యాంకులో డబ్బులు వేయాలంటేనే భయపడుతున్నారు. ఖమ్మం తో పాటు భద్రాచలం, మణుగూరు, సత్తుపల్లి, ఇల్లెందు తదితర ప్రాంతాలలో సైబర్ నేరస్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.
నేరాలకు పాల్పడేదిలా..?
వివిధ అవసరాల నిమిత్తం గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చేవారు డబ్బు వెంట తెచ్చుకుంటే ఎక్కడ చోరీకి గురవుతాయోననే భయంతో.. ఆ డబ్బును తమ బ్యాంకు ఖాతాల్లో వేసుకుని అవసరమైన మేరకు ఏటీఎంల ద్వారా డ్రా చేస్తుంటారు. ఆ సమయంలో వారిని అనుసరించిన సైబర్ నేరస్తులు వారి వెనుకే ఏటీఎం కేంద్రాల్లోకి ప్రవేశిస్తున్నారు. కార్డు చేతిలో పట్టుకుని నిల్చున్నప్పుడు దానిపై ఉండే ఎనిమిది నంబర్లలో చివర నాలుగింటిని, ఏటీఎం ఆపరేట్ చేసేప్పుడు పిన్ నబంర్‌ను గుర్తు పెట్టుకుంటారు. దీంతో వారి పని సులభతరమైనట్లే. దీని ఆధారంగా ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లి నెట్ ద్వారా విలువైన వస్తువులు కొనుగోలు చేసి, ఆ మొత్తాన్ని ఇతరుల ఖాతాల నుంచి చెల్లిస్తున్నారు.
నిద్రపోతున్న నిఘావర్గాలు...
చిన్నపాటి పొరపాట్లకే కేసులు పెట్టే పోలీసులు.. జిల్లా వాసుల బ్యాంకు ఖాతాల్లో లక్షల రూపాయల మాయం అవుతున్నా స్పందించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఖమ్మం నగరంలోని మయూరిసెంటర్, బస్టాండ్, రైల్వేష్టేషన్, కలెక్టరేట్‌తోపాటు కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాల్లో సైబర్ మోసాలు నిత్యకృత్యమవుతున్నాయి. వీటితోపాటు ద్విచక్ర వాహనాలు, మహిళల మెడలలో నుంచి బంగారు గొలుసులు చోరీకి గురవుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిఘా వర్గాలు అప్రమత్తంగా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని, ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి నేరాలను అదుపునకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.