పూర్తిస్థాయిలో తగ్గేవరకు పునరావాసం
నరసాపురం రూరల్ : జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ఆదివారం విస్తృతంగా పర్యటించారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని వివిధ గ్రామాల్లో పర్యటించి ఎప్పటికప్పుడు తుపాను పరిస్థితిని గమనించి అందుకు అనుగుణంగా అధికారులకు సూచనలు ఇచ్చారు. తుపాను పరిస్థితులు చక్కబడే వరకు పునరావాస కేంద్రాల్లో ప్రజలకు భోజన సౌకర్యం కల్పించాలని సుజాత అధికారులను ఆదేశించారు. ఆదివారం తుపాను ప్రభావిత గ్రామాలైన పెదమైనవానిలంక, తూర్పుతాళ్లు, కేపీ పాలెం, పేరుపాలెం ఏటిమొండి తదితర ప్రాంతాల్లో పర్యటించి పునరావాస కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న సేవలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. వర్షాల కారణంగా కొన్ని గ్రామాల్లో నీరు ఇళ్లలోకి ప్రవేశించిందని, అటువంటి వారు సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు. అధికార యంత్రాంగం తీసుకున్న పటిష్ట చర్యల కారణంగానే జిల్లాలో ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించలేదన్నారు.
జిల్లాలోని తీర ప్రాంతాల్లో పకృతి వైపరీత్యాల సమయంలో నష్టాల నివారణకు శాశ్వత పరిష్కారంగా కోస్టల్ కారిడార్, నరసాపురంలో పోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. తుపాను అనంతరం గ్రామాలన్నింటిలోనూ పారిశుధ్య నిర్వహణ పూర్తిస్థాయిలో జరిగేలా చూడాలని, వైద్యశిభిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు కలిగిన నష్టాలకు తక్షణమే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. తుపాను పూర్తిగా తగ్గేంత వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలన్నారు. మంత్రి వెంట రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, ఆర్డీవో పుష్పమణి, జిల్లాపరిషత్ సీఈవో ద్వారంపూడి వెంకటరెడ్డి, ఎంపీపీ వాతాడి కనకరాజు, జెడ్పీటీసీలు బాలం ప్రతాప్, గుబ్బల నాగరాజు, మైల వీర్రాజు, ఎంపీడీవో యన్వీ శివప్రసాద్‌యాదవ్, తహసిల్దార్లు ఎస్ బ్రహ్మానందం, హరనాథ్ పాల్గొన్నారు.
కోస్టల్ కారిడార్ ఏర్పాటు చేస్తాం
లింగపాలెం : పకృతి వైపరీత్యాలను శాశ్వతంగా ఎదుర్కొనేందుకు వీలుగా కోస్టల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి సుజాత తెలిపారు. ధర్మాజీగూడెంలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ కారిడార్ వల్ల ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ముందస్తు చర్యలను మరింత పటిష్టవంతంగా తీసుకోగలుగుతామన్నారు. జిల్లాలో 24 పునరావస కేంద్రాలను ఏర్పాటు చేసి 8,500 మందికి సహాయక చర్యలు అందించినట్టు చెప్పారు.