స్తంభించిన రవాణా
సాక్షి, రాజమండ్రి : హుదూద్ తుపాను ప్రభావంతో జిల్లాలో రవాణా స్తంభించింది. జిల్లా మీదుగా వెళ్లే 23 రైళ్లను రద్దు చేయడంతో రైల్వే స్టేషన్లు నిర్మానుష్యంగా మారాయి. శనివారం రాత్రి హైదరాబాద్, చెన్నైల నుంచి బయలుదేరిన సర్కార్, గౌతమి ఎక్స్‌ప్రెస్ రైళ్లను మాత్రమే ఆదివారం కాకినాడ వరకూ అనుమతించారు. ఆదివారం విశాఖ-విజయవాడ మధ్యలో రైళ్లన్నీ రద్దయ్యాయి. రాజమండ్రి నుంచి విజయవాడ, భీమవరం వైపు వెళ్లే ప్యాసింజర్ రైళ్లు మాత్రమే తిప్పారు. శని, ఆదివారాల్లో 200 మంది తమ రిజర్వేషన్లను రద్దు చేసుకున్నారని, వారికి రూ. లక్ష మేరకు చెల్లించినట్టు రాజమండ్రి స్టేషన్ మేనేజర్ బి. సుబ్రహ్మణ్య శాస్త్రి తెలిపారు. రైళ్లు రద్దుకావడం వల్ల మరో రూ. రెండు లక్షల మేరకు రైల్వేకు నష్టం వాటిల్లి ఉండవచ్చంటున్నారు.
ఆర్టీసీకి రూ. 25 లక్షల నష్టం
తుపాను ప్రభావం వల్ల బస్సులను నడపకపోవడం వల్ల ఆదివారం సాయంత్రం వరకూ జిల్లాలో ఆర్టీసీకి రూ. 25 లక్షలు నష్టం వాటిల్లిందని అధికారులు చెప్పారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం ప్రాంతాలకు వెళ్లే సుమారు 100 సర్వీసులను ఆర్టీసీ రద్దు చేసింది. కాగా తుని వరకూ అన్ని ప్యాసింజర్ సర్వీసులు యథావిధిగా తిప్పినట్టు అధికారులు చెప్పారు.
నిలిచిన వాణిజ్య రవాణా
తూర్పు విశాఖ సరిహద్దుల్లో 16వ నెంబరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను అధికారులు నిషేధించడంతో విజయవాడ- విశాఖ మధ్యలో రూ. కోట్ల విలువైన సరుకు రవాణా నిలిచి పోయింది. తుని నుంచి విశాఖవైపునకు వాహనాలు పూర్తిగా నిషేధించారు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ విమాన సర్వీసులను రద్దు చేశారు.
నేడు విశాఖ వైపు నుండి వచ్చే రైళ్లు రద్దు
రాజమండ్రిసిటీ : విశాఖ వైపు నుంచి వచ్చే పలు రైళ్లను సోమవారం రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఆదివారం రద్దు అయిన రైళ్లు అన్నీ సోమవారం కూడా నడవవన్నారు. విజయవాడ -విశాఖపట్నం మధ్య నడిచే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను రాజమండ్రి లేదా సామర్లకోట వరకూ నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాతావరణం సక్రమంగా ఉంటే ఆది వారం రద్దు చేసిన ఆర్టీసీ బస్సులను నడుపు తామని ట్రాఫిక్‌మేనేజర్ వరప్రసాద్ తెలిపారు.