
ప్రశాంతంగా డీసెట్
కర్నూలు (విద్య): డీఎడ్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన డైట్‌సెట్-2014(డీసెట్) ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు రావాలని అధికారులు ఆదేశించడంతో అభ్యర్థులు మారుమూల గ్రామాల నుంచి ఉదయం 9 గంటలకంతా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఉర్దూ మీడియానికి సంబంధించి పరీక్ష కేంద్రాలను డోన్‌లో ఏర్పాటు చేయడంతో పలువురు ముస్లిం మైనార్టీ మహిళా అభ్యర్థినులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కర్నూలులో 73, డోన్‌లో 10 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 92.2శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. తెలుగు మీడియంలో 17,944 మందికి గాను 16,522 మంది, ఉర్దూ మీడియంలో 931 మందికి 880 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నగరంలోని టౌన్ మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖాధికారి కె.నాగేశ్వరరావు సందర్శించారు. అలాగే కర్నూలులో రాష్ట్ర పరిశీలకులు, డిప్యూటీ డెరైక్టర్(ట్రైనింగ్) ఉషారాణి, మోడల్ స్కూల్స్ డిప్యూటీ డెరైక్టర్ విజయలక్ష్మి పలు కేంద్రాలను పరిశీలించారు.