
సమైక్యగర్జన అని ఎందుకు పెట్టలేదు: దాడి
హైదరాబాద్: నేడు తిరుపతిలో జరిగే టీడీపీ ప్రజాగర్జనలో సమైక్య తీర్మణం చేస్తేనే చంద్రబాబును ప్రజలు విశ్వసిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాడి వీరభద్రరావు అన్నారు. ప్రజాగర్జనకు సమైక్యగర్జన అని ఎందుకు పేరు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు ధైర్యముంటే విభజన గర్జన అని పేరుపెట్టాలని సవాల్ విసిరారు. చంద్రబాబు ఆంధ్రుడై ఉండి సిగ్గుపడే విధంగా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. ప్రత్యేక తెలంగాణకు కారకుడు చంద్రబాబే కారకుడని ఆరోపించారు.
రాష్ట్రపతిని కలిసిన సమయంలో సమన్యాయం అన్నారే గాని, రాష్ట్ర విభజన ఆపండి అనే పదాన్ని ఎందుకు వాడలేదని నిలదీశారు. సమన్యాయం చేయమనడం పరోక్షంగా రాష్ట్రాన్ని విభజించమని చెప్పడమేనని అన్నారు. 2004-2009లో వైఎస్సార్, జగన్‌లను తిడుతూనే రాజకీయాలు చేసినా బాబును ప్రజలు నమ్మలేదన్నారు. రాబోయే ఎన్నికలకు బాబు ఇదే పందాను ఎంచుకున్నారని అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఏ రాష్ట్రనికి ప్రతిపక్ష నేతగా ఉండాలో తేల్చుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై చంద్రబాబు స్పందించడం లేదని దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు.