బాబుది గర్జన కాదు.. ఈల మాత్రమే
వైఎస్సార్ కాంగ్రెస్ నేత దాడి వీర భద్రరావు ఎద్దేవా
సమైక్యం అనే మూడక్షరాలు ఎందుకు అనలేకపోతున్నారు
‘గర్జన’లోనైనా మీ విధానం ప్రకటిస్తారా?
వచ్చే ఎన్నికల్లోనూ చంద్రబాబుకు ఓటమి తప్పదు
జగన్‌పై కేసులన్నీ కుట్రపూరితంగా పెట్టినవే
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నుంచి మూడక్షరాల సమైక్యం అన్న పదం ఎందుకు రావడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు దాడి వీరభద్రరావు ప్రశ్నించారు. చంద్రబాబు తిరుపతిలో చేపడుతున్నది ప్రజాగర్జన కాదని, అది ఈల మాత్రమేనని ఎద్దేవా చేశారు. సీమాంధ్రలో నిర్వహిస్తున్న ఆ సభకు సమైక్య గర్జన అని ఎందుకు పేరు పెట్టలేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే దానికి విభజన గర్జనగానైనా నామకరణం చేయాలని సూచించారు. ఆదివారంనాడిక్కడ విలేకరుల సమావేశంలో దాడి మాట్లాడుతూ.. చంద్రబాబు రాష్ట్రపతిని కలసి రాష్ట్ర విభజన రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతోందని చెబుతున్నారు తప్ప రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ విభజన చేస్తున్నారని బాబు అనడం చూస్తే నిబంధనలకు లోబడి చేయమని చెబుతున్నట్లుగా ఉందని దాడి మండిపడ్డారు. చంద్రబాబు ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఎంతసేపూ జగన్నామస్మరణ చేయడం, దివంగత వైఎస్సార్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
2004, 2009 ఎన్నికల్లో వైఎస్, జగన్‌లపై అవినీతి ఆరోపణలు చేయడమే ఎజెండాగా పెట్టుకుని పరాజయం పాలయ్యారని, ఇప్పటికీ అదేపని చేస్తున్న చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లోనూ పరాజయం తప్పదని చెప్పారు. అధికారాన్ని పట్టుకుని వేలాడుతూ దండుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఒక్క రోజు కూడా చంద్రబాబు విమర్శించిన పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్‌లో ఉంటే జగన్‌పై కేసులు ఉండేవి కావని దిగ్విజయ్‌సింగ్ చెప్పారంటే.. ఇవన్నీ కుట్రపూరితంగా పెట్టిన కేసులే అని తేలిపోతోందన్నారు.
తనను ముఖ్యమంత్రిని చేస్తే మూణ్నెళ్లలో విభజన సమస్యను పరిష్కరిస్తానని బాబు చెప్పారని, అంటే ముఖ్యమంత్రిని చేస్తే తప్ప ఆ పరిష్కారం ఏమిటో చెప్పరా? అని ప్రశ్నించారు. దీనర్థం నిప్పుపెడుతున్నదీ, సంక్షోభానికి తానే కారణమని చంద్రబాబు చెప్పకనే చెప్పినట్లు కాదా? అన్నారు. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలోని 194వ పేజీలో చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాకే పార్టీలో తెలంగాణ కోరుతూ ఒక బృందం ఏర్పడిందని పేర్కొందని చెబుతూ.. అందుకు సంబంధించిన ప్రతులను దాడి వీరభద్రరావు పత్రికలకు విడుదల చేశారు. చంద్రబాబు దీనిని ఏనాడైనా ఖండించారా? అని ప్రశ్నించారు. టీడీపీలోని తెలంగాణ నేతలను రాష్ట్రపతి వద్దకు పంపుతున్న చంద్రబాబు.. వారి చేత రాష్ట్రాన్ని సత్వరం విభజించండని విజ్ఞప్తి చేయిస్తున్నారన్నారు. తిరుపతిలో నిర్వహిస్తున్న సభలోనైనా టీడీపీ విధానం ఏమిటో చంద్రబాబు ప్రకటిస్తారా? రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆ సభలో చెబుతారా.. రాష్ట్ర సమైక్యత కోసం ఏకగ్రీవ తీర్మానం చేస్తారా? అని దాడి ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో గెలిచి ఇంత పెద్ద రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి అవుతారని తెలిసి అలా కాకుండా చేశానన్న ఆత్మసంతృప్తి కోసం చంద్రబాబు రాష్ట్ర విభజనను కోరుకుంటున్నారని ఆరోపించారు. సోనియా ఇటలీ దేశస్తురాలు కనుక రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారని, కానీ తెలుగువాడైన చంద్రబాబు కూడా విభజనకు సహకరిస్తుండటం సిగ్గుచేటని మండిపడ్డారు.