
అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న దళిత సంఘాలు
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): దళితుల ఓట్లతో గద్దెనెక్కిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ను ఈ సారి ఆ దళితులే ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తొత్తరముడి శ్రీనివాస్ హెచ్చరించారు. దళితుల్ని చిన్నచూపు చూస్తున్న వాసుపల్లి ఎస్సీల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ నినదించారు. నీకు దళితులంటే ఎందుకంత అసహ్యం అంటూ ఆదివారం డాబాగార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. రాబోవు ఎన్నికల్లో టీడీపీ వాసుపల్లికి మరోసారి టికెట్ కేటాయిస్తే దళితులు అతనిని ఓడించడం ఖాయమన్నారు. దక్షిణ నియోజకవర్గంలో దుర్యోధుని పాలన సాగుతుందనుకుంటే దుశ్శాసన పాలన నడుస్తోందని మండిపడ్డారు.
దళితుల ఓట్లతో గెలిచిన వాసుపల్లి గణేష్‌కుమార్ దళితుల్ని పక్కన పెడుతున్నారని విమర్శించారు. 23వ వార్డులో ముగ్గురు బూత్ ప్రెసిడెంట్లు, శ్రీకనకమహాలక్ష్మి దేవస్థాన ధర్మకర్తల మండలి నుంచి ఓ దళితుడ్ని తప్పించారంటే వాసుపల్లికి దళితులంటే ఎంత చిన్నచూపో అర్థమవుతోందన్నారు. వాసుపల్లి దళితుల ద్రోహని, దురహంకారంతో వీగిపోతున్నారని మండిపడ్డారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు చెంగల చిన్నారావు, చెన్నా రామయ్య, ఇజ్రాయిల్ పలువురు ఎంఆర్‌పీఎస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment