సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో పట్టపగలే దారుణం జరిగింది. జ్వరంతో బాధపడుతూ ఇంట్లో ఒంటరిగా ఉన్న శివకుమార్ (19) అనే యువకుణ్ని కాళ్లు, చేతులు కట్టేసి లుంగీతో ఉరేసి దారుణంగా హతమార్చిన దుండగులు... బీరువాలోని కిలో బంగారం, రూ.12 లక్షల నగదు దోచుకుపోయారు. హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సీతారాంబాగ్ ఆగాపుర డి-బ్లాక్‌లో ఆదివారం సాయంత్రం ఈ ఘోరం జరిగింది. ఇసుక వ్యాపారులైన కావడి ఎల్లమ్మ, పోచయ్య దంపతుల దత్త పుత్రుడైన శివకుమార్ ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు.
ఆదివారం మధ్యాహ్నం పోచయ్య బంధువుల ఇంట్లో శుభకార్యానికి, ఎల్లమ్మ దుకాణానికి వెళ్లారు. పోచయ్య సోదరుని మనవడైన శివకుమార్ జ్వరంతో ఒంటరిగా ఇంట్లోనే ఉన్నాడు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో వంట గ్యాస్ రాగా ఎల్లమ్మ వచ్చి తీసుకుని తిరిగి దుకాణానికి వెళ్లింది. అనంతరం దుండగులు ప్రణాళిక ప్రకారం ఇంట్లోకి ప్రవేశించి లోపలి నుంచి గడియ పెట్టుకున్నారు. పెంపుడు కుక్క మొరగకుండా దానికి మత్తు మందిచ్చారు. పడుకుని ఉన్న శివకుమార్‌ను చంపేసి, మరో గదిలోని బీరువాలో దాచిన బంగారం, నగదు కాజేశారు. వెళ్తూ టీవీ ఆన్ చేసి, బయట నుంచి గొళ్లెం వేసి పారిపోయారు. ఇంటిపై అంతస్తుల్లో అద్దెకుంటున్న వారికి అలికిడి కూడా విన్పించలేదని తెలిసింది.
సాయంత్రం నాలుగింటికి ఇంటికొచ్చిన ఎల్లమ్మ, నిర్జీవంగా పడున్న శివను చూసి తల్లడిల్లింది. ఆమె ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో రాత్రి పదింటి దాకా పోలీసులు ఆధారాల కోసం ప్రయత్నించారు. పోలీసు జాగిలం సమీపంలోని మాజీ పోలీస్ అధికారి ఇంటిదాకా వెళ్లి ఆగింది. పోచయ్య ఎదురింట్లోని సీసీ కెమెరాల రికార్డులను పోలీసులు పరిశీలించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది తెలిసిన వారి పనిగా అనుమానిస్తున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.
పట్టపగలే హత్య, దోపిడీ
Published Mon, Aug 19 2013 2:49 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement
Advertisement