నష్టపరిహారం దక్కదని పురోణీలకు రిజిస్ట్రేషన్
భూ రిజిస్ట్రేషన్లపై ‘విమానాశ్రయం’ ప్రభావం
భోగాపురం మినహా చుట్టూ క్రయ, విక్రయాలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విమానాశ్రయం ఏర్పాటు నిర్ణయం భూ యజమానుల గుండెల్లో గుబులు రేపుతోంది. భూముల కొనుగోలు, అమ్మకాలపై ప్రభావం చూపుతోంది. విమానాశ్రయం ఏర్పా టైతే ప్రభుత్వ నష్టపరిహారం దక్కదనే భయంతో పురోణీలను అత్యవసరంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో జూలై నెలలో భారీగా జరిగిన రిజిస్ట్రేషన్లే దీనికి నిదర్శనం. విమానాశ్రయానికి వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతం కావడంతో భోగాపురం తప్ప మిగిలిన మండలాల్లో ఒక్క నెలలో 1218 రిజిస్ట్రేషన్లు జరిగాయి. రూ.4.38 కోట్ల ఆదాయంతో, రిజిస్ట్రేషన్లతో భోగాపురం రెండో స్థానంలో నిలిచింది. విజయనగరం ఆర్వో కార్యాలయం రూ.4.5 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది. విశాఖ నగరానికి సమీపంలో ఉన్న భోగాపురం జాతీయ రహదారిని ఆనుకుని ఉండటంతో సాధారణంగా భూ క్రయ, విక్రయాలు ఇక్కడ ఎక్కువగా జరుగుతాయి.
ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో భోగాపురానికి చెందిన భూ రిజిస్ట్రేషన్లతోనే రెండింతల ఆదాయం వచ్చేది. కానీ ఈ మండలంలో విమానాశ్రయం ఏర్పాటు నిర్ణయంతో పరిస్థితి మారింది. విమానాశ్రయాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టత లేక, ఎప్పుడే అలైన్‌మెంట్‌తో ముందుకొస్తారో తెలియక భోగాపురం మండలంలో క్రయ, విక్రయాలు పెద్దగా జరగలేదు. దీంతో గతంలో పురోణీలు (అగ్రిమెంట్) రాసుకుని క్రయ, విక్రయాలు చేసుకున్న వారు మాత్రం రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఒకవేళ విమానాశ్రయం పరిధిలోకి ఆ భూములొస్తే ప్రభుత్వమిచ్చే నష్టపరిహారం అసలు యజమానికి పోతుందని, పురోణీ రాసుకుని చేసిన కొనుగోలుకు చట్టబద్దత ఉండదనే అభిప్రాయంతో హుటాహుటిన వాటిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
అంతే తప్ప కొత్తగా క్రయ, విక్రయాలు జరగలేదు. భోగాపురం మండలంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తే పక్కనే ఉన్న డెంకాడ, పూసపాటిరేగ ప్రాంత భూములకు డిమాండ్ పెరుగుతుందని కొనుగోలుదారులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు. విశాఖకు చెందిన బడా వ్యక్తులతో కలిసి విజయనగరం జిల్లా రియల్టర్లు దాదాపు అక్కడే సొమ్ము వెచ్చించి భారీగా భూముల్ని కొనుగోలు చేసారు. అత్యధికంగా డెంకాడ మండలంలో క్రయ, విక్రయాలు భారీగా జరిగాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో జరిగిన 1218 రిజిస్ట్రేషన్లలో రెండింతలు డెంకాడ మండలానికి చెందినవేనని తెలుస్తోంది. మిగతావి జాతీయ రహదారికి పది కిలోమీటర్ల దూరంలోని పూసపాటిరేగ మండలంలో జరిగినవి. దీన్నిబట్టీ భూమ్ అంతా భోగాపురం మండలం చుట్టుపక్కలే ఉందని తెలుస్తోంది. విశాఖను ఆనుకున్న కొత్తవలసలో 1222 రిజిస్ట్రేషన్లు జరిగి ప్రథమ స్థానంలో నిలిచింది.
గుండెల్లో ‘విమానాలు’
Published Mon, Aug 3 2015 1:08 AM | Last Updated on Sun, Sep 3 2017 6:39 AM
Advertisement
Advertisement