సాక్షి, నెల్లూరు: రాష్ట్ర విభజన ప్రకటన సీమాంధ్రలో అగ్గి రాజేసింది. కాంగ్రెస్ కుటిల నిర్ణయంతో కడుపు మండిన సమైక్య వాదులు రోడ్లెక్కి ఆందోళనలకు దిగారు. పర్యవసానంగా సమైక్యాంధ్ర ఉద్యమం చరిత్రలో ఎన్నడూ లేనంతగా జోరుగా సాగుతోంది. అంతెందుకు ప్రభుత్వ ఉద్యోగులు సైతం విభజనను వ్యతిరేకిస్తూ ఉద్యమం కోసం విధులను వదలి వీధులకెక్కారు.
ఏ ప్రజల ఓట్లతో అధికార దర్పం అనుభవిస్తున్నారో ఆ ప్రజల ఆకాంక్షతో తమకెందుకు అన్నట్టుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, సిటీ ఎమ్మెల్యే శ్రీధరకృష్ణారెడ్డి, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరిచినట్టున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
కనీసం ఉద్యమకారులకు మద్దతు ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఉద్యమ ప్రారంభంలో ఒకటిరెండు ప్రకటనలు, మొక్కుబడి కార్యక్రమాలతో తమ బాధ్యత పూర్తయినట్టు చేతులు దులుపు కున్నారే తప్పించి ఆ తర్వాత పత్తా లేరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ సమైక్యాంధ్రంటే తామే అన్నట్టుగా మీడియాలో నానా హంగామా చేసిన ఆనం సోదరులు, తీరా ఉద్యమం మొదలయ్యాక అస్త్ర సన్యాసం చేయడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఒక వైపు ఉద్యమం తీవ్రరూపం దాల్చి జిల్లా ఆందోళనలతో అట్టుడికి పోతుంటే ఎమ్మెల్యేలు,మంత్రి మాత్రం ఉద్యమం పక్కన పెట్టి నియోజక వర్గాలలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు పరిమిత మయ్యారన్న విమర్శలున్నాయి.
పనికంటే మిగిలివన్నీ ఎక్కువ చేసే ఆనం వివేకా కనపడకుండా తిరుగు తుండడం ఆనం సోదరుల నైజాన్ని తెలియ జేస్తోందని సమైక్య వాదులు మండిపడుతున్నారు. రూరల్ ఎమ్మెల్యే కనుసన్నలలో మెలిగే నగర ఎమ్మెల్యే ముంగమూరు విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మంత్రి ఆనం మాత్రం స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని వెళ్లారు. ఆ తర్వాత నెల్లూరు వైపు తిరిగి చూడలేదు. జిల్లాలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సమైక్యాంధ్ర కోసం తమవంతుగా దీక్షలకు దిగారు. ఆందోళనల బాట పట్టారు. ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొట్టే ఆనం సోదరులు మాత్రం ఆచరణలో చూపకపోవడంతో జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అస్త్ర సన్యాసం
Published Fri, Aug 30 2013 4:27 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement