
విద్యుదాఘాతంతో డిగ్రీ విద్యార్థి మృతి
రూ.50 వేల విలువైన గేదె కూడా మృత్యువాత .
నాదెండ్ల : విద్యుదాఘాతంతో డిగ్రీ విద్యార్థి మృతి చెందిన సంఘటన నాదెండ్ల గ్రామంలోని పంట పొలాల్లో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన తాటి సతీష్ (19) చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. వేసవి సెలవులు కావటంతో ఉదయాన్నే గేదెలను తోలుకుని పొలం వెళ్లాడు. రక్షిత మంచినీటి చెరువు ఎదురుగా ఉన్న పొలాల్లో గేదెలను మేపుతున్నాడు. ఈ క్రమంలో గేదె అరటితోటకు వేసిన ఫెన్సింగ్ తీగలకు తగిలింది. అప్పటికే పొలానికి వెళ్లే విద్యుత్ లైను ఫెన్సింగ్ తీగలకు తగిలి విద్యుత్ ప్రవహిస్తోంది. గేదె అక్కడికక్కడే గిలగిలాకొట్టుకుని మృతి చెందింది. ఈ దృశ్యాన్ని చూసిన సతీష్ గేదెకు ఏమైందోనని దగ్గరకు వెళ్లటంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు.
కొన ఊపిరితో ఉన్న సతీష్‌ను చిలకలూరిపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చేతులు, కాళ్లకు విద్యుత్ తీగ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. సతీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎస్సై చంద్రశేఖర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. గ్రామంలోని ప్రజలు భారీ ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ప్రమాదానికి గురై మృతి చెందిన గేదె విలువ సుమారు రూ.50 వేలు ఉంటుందని స్థానికులు తెలిపారు.