అప్పటివరకు ఆ బస్సులో ప్రయాణికులంతా తమ గమ్యాలకు ఎప్పుడు చేరుతామా.. అనుకుంటూ ప్రయాసపడుతున్నారు. ఒక్కసారిగా బస్సు ఆపాలంటూ ప్రయాణికుల్లో కూర్చున్న ఓ మహిళ ఆర్తనాదం వినిపించింది. అంతే.. డ్రైవర్ బస్సును పక్కకు తీశాడు. ఏం జరిగిందని తెలుసుకునేలోపే ‘కేర్’ మంటూ చంటిపాప ఏడుపు వినిపించింది.
అప్పటివరకు ఆ బస్సులో ప్రయాణికులంతా తమ గమ్యాలకు ఎప్పుడు చేరుతామా.. అనుకుంటూ ప్రయాసపడుతున్నారు. ఒక్కసారిగా బస్సు ఆపాలంటూ ప్రయాణికుల్లో కూర్చున్న ఓ మహిళ ఆర్తనాదం వినిపించింది. అంతే.. డ్రైవర్ బస్సును పక్కకు తీశాడు. ఏం జరిగిందని తెలుసుకునేలోపే ‘కేర్’ మంటూ చంటిపాప ఏడుపు వినిపించింది. కూర్చున్న సీట్లోనే మహిళ పండంటి పాపను ప్రసవించింది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చే ఆర్టీసీ బస్సు ప్రసవానికి పాన్పుగా మారింది.
ఎల్కతుర్తి, న్యూస్‌లైన్ :
వరంగల్ జిల్లా చిట్యాల మండలం పంగిడిపల్లి గ్రామానికి చెందిన గంధం లత నిండుచూలాలు. పురుడు కోసం తల్లిగారి ఊరైన వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి మండలం దుబ్యాల గ్రామానికి వెళ్లింది. అక్కడే రాఖీ పండగను జరుపుకుంది. వైద్యులు ఆదివారం ప్రసవానికి తేదీ ఇచ్చారు. శనివారం ఉదయం నుంచి లతకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. తల్లిని తోడుగా తీసుకుని బస్సులో హన్మకొండలోని మిషన్ ఆసుపత్రికి బయల్దేరింది. దగ్గరిదారిలో మొగుళ్లపల్లి నుంచి జమ్మికుంట, హుజూరాబాద్ మీదుగా వెళ్తుండగా బస్సు ఎల్కతుర్తి సమీపంలోకి రాగానే లతకు నొప్పులు ఎక్కువయ్యాయి. భరించలేక ఆమె కేకలు వేయడంతో డ్రైవర్ గాండ్ల శ్రీనివాస్ బస్సును ఎల్కతుర్తిలో నిలిపివేశాడు. విషయం తెలుసుకున్న ప్రయాణికులంతా బస్సు దిగారు. ఆ మరుక్షణమే లత ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
కెవ్వున కేకలు వినిపించడంతో ప్రయాణికుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆ సమయంలో బస్సులో ప్రసవాలు చేసిన అనుభవజ్ఞులు లేకపోవడంతో బొడ్డు కొయ్యని పాప, తల్లి పరిస్థితి ఎలా ఉంటుందోనని డ్రైవర్ శ్రీనివాస్ అప్రమత్తమై వారిని బస్సులోనే వేగంగా హన్మకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. అక్కడ తల్లీబిడ్డలను పరీక్షించిన వైద్యులు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, బిడ్డ రెండున్నర కిలోలు ఉందని తెలిపారు. తల్లీబిడ్డలకు ఎలాంటి అపాయం లేదని తెలిసి డ్రైవర్ శ్రీనివాస్ ఆనందంతో ఊపిరి పీల్చుకున్నాడు. అప్రమత్తంగా వ్యవహరించి తల్లీబిడ్డలను ఆసుపత్రికి చేర్చిన బస్సు డ్రైవర్‌కు లత తండ్రి గంధం శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన డ్రైవర్‌ను ప్రయాణికులు సైతం అభినందించారు.