సాక్షి, కర్నూలు(కొండారెడ్డిపోర్టు)/అగ్రికల్చర్: దివంగత నేత వైఎస్ రాజ శేఖర్‌రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో పెద్ద కుట్రే ఉన్నట్టు స్పష్టమవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలన్న ప్రత్యర్థుల వ్యూహంలో భాగంగానే ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది. హత్య ఎవరు చేశారో పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిర్ధారించాల్సిన ప్రభుత్వ పెద్దలు రాజకీయాలు మాట్లాడడంపై ప్రజలు మండిపడుతున్నారు.
కేసు పక్కదోవ పట్టించే విధంగా టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేయడాన్ని తప్పు పడుతున్నారు. రాష్ట్రంలో రాక్షసపాలన నడుస్తోందని, ఈ హత్యోదంతమే నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా..వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందంటే బోలెడు కారణాలు కనిపిస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు.. అదీ పోలింగ్‌కు సరిగా 26 రోజుల ముందు వివేకానందరెడ్డిని హత్య చేయడం వల్ల ఓ బలమైన సంకేతం ఇవ్వాలన్న తాపత్రయం కనిపిస్తోంది.
పులివెందులలోనే వివేకాను హత్య చేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా చేయవచ్చన్న వ్యూహం కనిపిస్తోంది. వైఎస్సార్, కర్నూలు జిల్లాలో వైఎస్ వివేకానందరెడ్డికి పరిచయాలున్నాయి. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రెండు జిల్లాల రాజకీయాల్లో వివేకానందరెడ్డి క్రియాశీలకంగా ఉండేవారు. అజాత శుత్రువైన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వివేకాందరెడ్డి హత్య దారుణం
వైఎస్ వివేకానందరెడ్డి హత్య తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించింది. ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఘటనలు మంచివి కావు. వివేకానందరెడ్డి వివాద రహితుడు,
అజాతశత్రువనే పేరు ఉంది. అటువంటి నాయకుడి హత్య అందరినీ కలచి వేసింది. ఈ హత్య ఘటనపై రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా విచారణ జరుపాలి. ఈ హత్య వెనుక ఎవరు ఉన్నా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి.
– అంబన్న, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీయుడబ్ల్యూజే
నిష్పక్షపాతంగా విచారణ జరపాలి
వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటనపై సమగ్రంగా.. లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది.ఎన్నికల సమయంలో ఈ హత్య జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాలి. ఎన్నికల సమయంలో ఇటువంటి సంఘటనలు మంచివి కాదు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడానికే ఈ హత్య చేసినట్లు కనిపిస్తోంది. హత్య వెనుక ఎవరు ఉన్నారో తేల్చాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉంది.
– కృష్ణమూర్తి యదవ్, విశ్రాంత సహాయ వాణిజ్యపన్నుల శాఖ అధికారి
కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది
వైఎస్ వివేకానందరెడ్డి హత్యను పక్కదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది. వివాద రహితుడైన వివేకానందరెడ్డి హత్యను ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ఎవరికీ హాని కలిగించని వివేకానందరెడ్డి హత్యకు గురికావడం దారుణమైన విషయం. హత్యపై అనేక అనుమానాలు ఉన్నందున ఎలాంటి రాజకీయ వత్తిళ్లకు లొంగకుండా పోలీసు యంత్రాంగం దర్యాప్తు చేసి దోషులను గుర్తించాలి. అపుడే పోలీసు వ్యవస్థపై నమ్మకం ఏర్పడుతుంది.
– ఖాజామోహిద్దిన్, జిల్లా అధ్యక్షుడు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ
ప్రజాస్వామ్యంలో ఇలాంటివి మంచిది కాదు
ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి హత్యలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగించే విషయం. ఎన్నికల సమయంలో జరిగిన హత్యను పోలీసు యంత్రాంగం సీరియస్‌గా తీసుకోవాలి. లోతుగా విచారణ జరిపి దోషులను గుర్తించి.. అరెస్ట్ చేయాలి. ప్రజాస్వామ్యంలో ఇటువంటి హత్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి. పోలీసు వ్యవస్థపై నమ్మకం వమ్ము కాకుండా వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది.
– తిమ్మన్న, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్‌టీయూ
వివేకాది రాజకీయ హత్యే
వైఎస్ వివేకానందరెడ్డిది ముమ్మాటికీ రాజకీయ హత్యనే. ఇందులో ఎటువంటి అనుమానాలకూ తావులేదు. వైఎస్ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగితే కేసును పక్కదోవ పట్టించారు. ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును కూడా పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ హత్యలకు తావు ఉండరాదు. హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. హత్య వెనుక ఎవ్వరున్నా బయటికి తీసి చట్ట ప్రకారం శిక్షించాలి.
– సుధాకర్, న్యాయవాది, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment