ప్రజల్లో డెంగీ భయం!
- సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ వైద్యగణం
- జిల్లాలో 143 డెంగీ కేసులు
- బాధితుల్లో 115 మంది పిల్లలే
- జ్వరం వచ్చినా డెంగీ అంటూ భయపెడ్తున్న వైనం
- కొరవడిన వైద్య ఆరోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణ
అనంతపురం మెడికల్ : జిల్లాలో డెంగీ భయం ప్రజలను వణికిస్తోంది. రెండు రోజులు జ్వరం కాస్తే ముందు జాగ్రత్త చర్యగా వైద్యుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఇదే అదనుగా కొందరు ప్రైవేటు డాక్టర్లు వారిని మరింత భయపెడతూ వేలకువేల రూపాయలు గుంజుతున్నారు. డెంగీ బారిన పడుతున్న వారిలో చిన్నారులే అధికంగా ఉంటుండడంతో వారిని ఎలాగైనా కాపాడుకోవాలన్న తపనతో డాక్టర్లు ఎంత అడిగితే అంత చెల్లిస్తూ పేద ప్రజలు జేబులు గుల్ల చేసుకుంటున్నారు. దీనిని నియంత్రించాల్సి న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మా త్రం నిమ్మకునీరెత్తినట్లున్నారు.
వివరాల్లోకి వెళితే.. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 143 డెంగీ కేసులు నమోదయా ్యయి. జనవరి నుంచి జూన్ వరకు 35 డెంగీ పాజిటివ్ కేసులు నమోదవగా.. ఒక్క జులై మాసంలోనే ఏకంగా 88 కేసులు నమోదయ్యాయి. ఆగస్టులో 20 వరకు అయ్యాయి. డెంగీ బారిన పడిన వారిలో ప్రధానంగా 14 ఏళ్లలోపు ఉన్న పిల్లలు 115 మంది వరకు ఉన్నారు.
రక్త పరీక్షలతో బెంబేలు : చిన్నపాటి జ్వరం, ఒళ్లు నొప్పులు, సీజనల్ వ్యాధులతో ఆస్పత్రులకు వెళ్లినా రకరకాల పరీక్షలతో బెంబేలెత్తిస్తున్నారు. వాస్తవానికి డెంగీని నిర్ధారించే పరీక్షలు చేసే పరికరాలు లేకున్నా అందినకాడికి పిండుకుంటున్నారు. జిల్లా కేంద్రంతో పాటు కదిరి, హిందూపురం, ధర్మవరం, గుంతకల్లు, తాడిపత్రి ప్రాంతాల్లో ఈ దోపిడీ రోగం పట్టుకుంది. డెంగీ సోకిన చిన్నారుల్లో సుమారు 50 మంది వరకు అనంతపురంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలోనే చికిత్స పొందారు. అవసరమైన చికిత్సలు చేయకపోయినా నాలుగైదు రోజులు ఉంచుకుని వేలాది రూపాయలు బిల్లు వేస్తున్నారు.
డెంగీ నిర్ధారించాలంటే..:
ఐదు రోజుల వరకు రోజూ జ్వరం ఉంటే నాన్ స్ట్రక్చురల్ ప్రొటీన్ యాంటిజెన్ పరీక్ష చేస్తారు. పది రోజుల వరకు జ్వరం వస్తే ఇమ్యునోగ్లోబులిన్ యాంటిజెన్ పరీక్ష చేస్తారు. ఎలీసా విధానంలో చేస్తేనే ఈ రెండు రకాల పరీక్షలు పక్కాగా వస్తాయి. జిల్లాలో కేవలం అనంతపురం మెడికల్ కళాశాల, హిందూపురం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మాత్రమే ఈ పరీక్షకు సంబంధించిన పరికరాలున్నాయి. డెంగీ పరీక్షల ఖచ్చితమైనఫలితం రావాలంటే ఆరు గంటల సమయం పడుతుంది. నిర్ధారణ కాదని తెలిసినా ప్రైవేట్ వైద్యులు ర్యాపిడ్ విధానాన్ని అనుసరిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. మందులు ఇచ్చినా జ్వరం అదుపులోకి రాకపోతే డెంగీగా భావించి ప్లేట్‌లెట్ల సంఖ్య పరీక్షలు చేస్తున్నారు. దీనికి నామమాత్రపు ఫీజు వసూలుచేయాల్సి ఉన్నప్పటికీ రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు.
అసలు కథ ఇక్కడి నుంచే..
జిల్లాలోని కొందరు ప్రైవేట్ వైద్యులు రోగులను కొద్ది రోజులు తమ ఆ స్పత్రుల్లో ఉంచుకొని తర్వాత ఇతర ప్రాంతాలకు రెఫర్ చేస్తారు. అసలు కథ మొదలవుతోంది. కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లిన ప్రతి రోగికీ రూ.70 వేల వ రకు బిల్లు వేసి డెంగీ నయం చేసినట్లు పంపుతున్నారు. రోగిని పంపిన స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన డాక్టర్లకు పది శాతం వరకు కమీషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్‌ఎంపీ మొదలు ఎంబీబీఎస్ వరకు ఇలా కాసులకు కక్కుర్తి పడి రోగులను కార్పొరేట్ ఆస్పత్రులకు తరలించి దండుకుంటున్నారు.
కొరవడిన పర్యవేక్షణ
జిల్లాలోని ల్యాబ్‌లు, క్లినిక్‌లు, నర్సింగ్ హోంల నిర్వాహకుల వివరాలను వైద్య ఆరోగ్యశాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కానీ జిల్లాలో వివరాలు పూర్తిగా నమోదు కావడం లేదు. నమోదైనా కొన్నింటికి సంబంధించి వాటి రిజిస్ట్రేషన్‌ల పునరుద్ధరణ ఊసే ఉండడం లేదని తెలుస్తోంది. పరిస్థితి ఇలా ఉన్నా అధికారులు మాత్రం తనిఖీలు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.