సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: డీఈఓ రమేష్ బదిలీ అయినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా విద్యాధికారి రాజేశ్వర్‌రావు నియమితులైనట్టు తెలుస్తోంది. ఈ బదిలీ వెనుక ప్రభుత్వ విప్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రధాన పాత్ర పోషించినట్టు సర్వత్రా గుసగుసలు వినిపిస్తున్నాయి. సంవత్సర కాలంగా డీఈఓను బదిలీ చేసేందుకు ఎమ్మెల్యే తీవ్ర ప్రయత్నాలు చేశారు.
ఎమ్మెల్యే చర్యలను విద్యార్థి సంఘాలతో పాటు ఉపాధ్యాయ సంఘాల్లోని కొందరు నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. డీఈఓను బదిలీ చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాలు డీఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మంచిగా పనిచేసే అధికారిని ఎలా బదిలీ చేస్తారో చూస్తానంటూ జోక్యం చేసుకోవడం వల్ల అప్పట్లో బదిలీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది.
తాజాగా ఎన్నికల సందర్భంగా వివిధ శాఖల అధికారుల బదిలీల ప్రక్రియలో భాగంగా పెండింగ్‌లో ఉన్న భాగంగా పెండింగ్‌లో ఉన్న డీఈఓ బదిలీ ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం సంతకం చేసినట్లు తెలిసింది. డీఈఓ రమేశ్‌ను ఆదిలాబాద్‌కు బదిలీ చేస్తూ ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా విద్యాశాఖాధికారి రాజేశ్వర్‌రావును నియమించినట్టు సమాచారం. ప్రైవేటు పాఠశాలల వ్యవహారంలో డీఈఓ ఎమ్మెల్యే సూచనలు పట్టించుకోకపోవడంతో పాటు మారుమూల పాఠశాలల పనితీరుపై ప్రత్యేక దృష్టిని సారించి పని చేయని ఉపాధ్యాయులపై వేటు వేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే డీఈఓకు, ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మధ్య విభేదాలు తలెత్తినట్టు సమాచారం.
ఎమ్మెల్యే సూచించిన ఏ ఒక్కటీ కూడా డీఈఓ చేయకపోవడంతోపాటు, తన పరిధిలో లేదంటూ దాట వేస్తూ రావడంతో జగ్గారెడ్డి తీవ్ర గుర్రుగా ఉన్నట్టు వినికిడి. తన సిఫార్సులను లెక్క చేయని డీఈఓను ఎలాగైనా బదిలీ చేయించాలని ఎమ్మెల్యే నిర్ణయించుకున్నట్టు సమాచారం. పైగా డీఈఓ బదిలీ తన వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనుకున్నట్లుగానే ముఖ్యమంత్రి ద్వారా బదిలీ ఉత్తర్వులపై సంతకం చేయించినట్టు సమాచారం.
దూకుడుగా వెళ్లడమే కారణమా?
జిల్లా విద్యాశాఖాధికారిగా 2012 ఏప్రిల్ 9న బాధ్యతలు చేపట్టిన్నప్పటి నుంచి దూకుడుగా వెళుతుండటంతో మింగుడుపడని ఉపాధ్యాయ సంఘాలు డీఈఓ బదిలీకి పైరవీలు ప్రారంభించాయి. ఆయనను బదిలీ చేయిస్తే వచ్చే ఎన్నికల్లో ఉపాధ్యాయులంతా మీ గెలుపు కోసం పనిచేస్తారని గుర్తింపు పొందిన పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రజాప్రతినిధిపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం.
దీంతో వారి మద్దతు కూడగట్టుకునేందుకు డీఈఓ బదిలీ వ్యవహారాన్ని తన భుజాలపై వేసుకుని బదిలీ తతంగాన్ని చివరివరకు ఆయనే నడిపించినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డీఈఓ బదిలీకి దూకుడుగా వ్యవ హరించడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా పనిచేయని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడంలో డీఈఓ రమేష్ వెనుకంజ వేసేవారు కాదు. విధులకు సక్రమంగా హాజరుకాని ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన వారిలో అధికంగా ఉపాధ్యాయ సంఘాల్లోని జిల్లాస్థాయి నాయకులే ఉన్నారు.
ఇదిలా ఉంటే పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు జూలై మొదటి వారం నుంచే ప్రత్యేక తరగతులతో పాటు ప్రతి శుక్రవారం క్విజ్ పోటీలు, తదితర కార్యక్రమాలను చేపట్టారు. కొత్తగా వచ్చిన కలెక్టర్ సైతం డీఈఓ చేపట్టిన కార్యక్రమాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ అందుకు ప్రతి రోజూ విద్యార్థులకు సాయంత్రం వేళల్లో అల్పాహారం ఇచ్చేందుకు నిర్ణయించారు. దీంతో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పటిష్టతకు కలెక్టర్, డీఈఓ చేసిన కృషిని జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు. ఇదిలా ఉండగా పలు కారణాల చేత బదిలీ ఆగే అవకాశం లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు.
బదిలీ చేయడం సరికాదు
సంగారెడ్డి మున్సిపాలిటీ: ప్రభుత్వ పాఠశాలల పటిష్టత కోసం కృషి చేస్తున్న జిల్లా విద్యాశాఖాధికారిని తన రాజకీయ పలుకుబడి కోసం బదిలీ చేయించడం సరైంది కాదని ఈ సమయంలో కలెక్టర్ జోక్యం చేసుకొని డీఈఓ బదిలీ నిలిపి వేయాలని టీ జేఏసీ పశ్చిమ జిల్లా చైర్మన్ వై.అశోక్‌కుమార్, ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కిషన్, మార్పు కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్నార్, టీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ ఇన్‌చార్జి గౌతంరెడ్డి, ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షుడు సురేష్‌లు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.
సమాజం కోసం నిజాయితీగా పనిచేసే అధికారులను తమ ఉనికి కోసం రాజకీయ నాయకులు బదిలీ చేయిం చడం సరికాదన్నారు. ఈ సంస్కృతిని ప్రజలు ప్రతిఘటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గతంలో ఎస్పీగా పనిచేసిన అవినాష్ మహంతిని అలాగే బదిలీ చేయించారని, తాజాగా డీఈఓను మూడు సంవత్సరాలు నిలువకుండానే కొందరుస్వార్థ పరులు తమ ఉనికి కోసం బదిలీ చేయిస్తున్నారన్నారు.
డీఈఓ బదిలీ!
Published Tue, Feb 11 2014 11:47 PM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
Advertisement
Advertisement