బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
విశాఖ :బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదలటంతో కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతాలను ఆనుకొని పశ్చిమ బంగాళాఖాతంలో ప్రస్తుతం తీరంవైపు అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది వాయుగుండంగా మారే వాతావరణ పరిస్థితులపై ఈరోజు ఒక అంచనాకు వస్తామని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.
అదే సమయంలో మరో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడతాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తామన్నారు. వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్ర జిల్లాలతోపాటు రాయలసీమలోని కడప, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొందని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తిరుమలలో గత రెండు రోజులు నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కర్నూలు జిల్లా శ్రీశైలంలో వర్షాల కారణంగా ఆలయం ముందు ఉన్న దుకాణాల వరకూ వర్షపు నీరు చేరింది. మరోవైపు వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రజలు విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించారు.