
సాక్షి, విజయవాడ: కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజాను నియమించడం కాపులందరికీ దక్కిన గౌరవమని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. ఆదివారం జరిగిన కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవీ స్వీకార ప్రమాణ సభలో ఆయన మాట్లాడుతూ.. కాపు కార్పొరేషన్ టీడీపీ దోపిడీకి గురైందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో కాపుల కోసం విడుదలయిన నిధుల మొత్తం టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్ళాయన్నారు. కాపుల సంక్షేమం గురించి చంద్రబాబు ప్రధానితో ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. చంద్రబాబు మోసపూరిత చర్యలతో అగ్రవర్ణాలలో చిచ్చు రగిలిందన్నారు. చంద్రబాబును కాపులు ఇక జీవితంలో నమ్మరని తెలిపారు. కాపులను విస్మరించకుండా ఇచ్చిన మాటకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కట్టుబడి బాధ్యతగా పనిచేస్తున్నారని ఆళ్ల నాని చెప్పారు. ఈ సందర్భంగా కాపుల పక్షాన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
సీఎం జగన్.. కాపు సామాజిక వర్గ ఆరాధ్య నేత
ప్రతి కాపు విద్యార్థికి కార్పొరేషన్ అండగా ఉండాలని మంత్రి పేర్ని నాని అన్నారు. కాపు సామాజిక వర్గమంతా ఆరాధించే నాయకుడు సీఎం జగన్ అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ నిధులు మంజూరు చేయాలని జక్కంపూడి రాజాను ఆయన కోరారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి సీఎం జగన్
కాపులను టీడీపీ రాజకీయంగా మాత్రమే వాడుకుందని ఎమ్మెల్యే కిలారి రోశయ్య అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని ప్రశంసించారు. కాపులకు ఇచ్చిన నిధులను సక్రమంగా వినియోగించాలని కోరారు.