‘దేశం’లోకి దొంగలొస్తున్నారు!
- జాగ్రత్తగా ఉండండి..
- నమ్మకద్రోహులను తరిమికొట్టండి
- అయ్యన్న తీవ్ర వ్యాఖ్యలు
నక్కపల్లి, న్యూస్‌లైన్: దేశంలో దొంగలు పడుతున్నారు జాగ్రత్త... ఇదేదో సినిమా టైటిల్ అనుకునేరు! కాదు.. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ చేసిన హెచ్చరికలు! బుధవారం మండలంలో వేంపాడులో పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. గతంలో టీడీపీని వీడిన పిఏసీఎస్ డెరైక్టర్, పార్టీ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు కల్లేపల్లి బాబ్జీరాజు తిరిగి పార్టీలోకి చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అయ్యన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై నిప్పులు చెరిగారు. ఇటీవల కాలంలో కొంతమం ది స్వార్థపర నాయకులు పదవీ వ్యామోహంతో దొంగలుగా టీడీపీలోకి వచ్చి పార్టీని భ్రష్టుపట్టించాలని చూస్తున్నార ని ఆయన విమర్శించారు. ఇటువంటి దొంగలను, నమ్మకద్రోహులను నివారించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని హెచ్చరించారు. ‘భర్తతో కాపు రం చేస్తేనే సంసారమవుతుంది, కాకుం టే వ్యభిచారమవుతుంది.
రాజకీయ నాయకుడన్నవాడు స్థిరంగా ఓ పార్టీలో ఉండాలి. విలువలతోకూడిన రాజకీయాలు చేయాలి. ఇలాంటి దొంగల వల్ల పార్టీపై ప్రజల్లో విశ్వాసం పోతుంది.’ అని వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో నాలు గు పార్టీలు మారే వారిపట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎప్పుడూ అధికారమే అనుభవించాలని దురాశకు పోవడం తగదన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు తిరిగి పార్టీలో చేరితే దేశంలో దొంగలు పడినట్లేనన్నారు. గతంలో టీడీపీలో చేరి ఎంపీ, ఎమ్మెల్యే పదవులు అనుభవించి ప్రజారాజ్యంలో చేరారని, ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమయ్యాక మంత్రి అయ్యారని, ఇప్పుడు ఆ పార్టీ కష్టాల్లో ఉంటే తిరిగి టీడీపీలో చేరడం సిగ్గు చేటని విమర్శించారు.
కాంగ్రెస్‌ప్రభుత్వం హయంలో అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించగల సత్తా చంద్రబాబుదేనని చెప్పారు. పార్టీ జిల్లా అధ్య క్షుడు గవిరెడ్డి రామానాయుడు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, నియోజకవర్గ ఇన్‌చార్జి అనిత మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పా రు. గునిపూడిసర్పంచ్ లక్ష్మణరావు, ఉపసర్పంచ్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.