=టీ బిల్లు రావడమే ఆలస్యం
=టీడీపీలోకి గంటా అండ్ కో
=అయ్యన్న వ్యతిరేక వర్గం స్వాగతం
=అగ్గి మీద గుగ్గిలమవుతున్న చింతకాయల
=గంటాకు విశాఖ లోక్‌సభ, పంచకర్లకు విశాఖ నార్త్ టికెట్ల హామీ
=భీమిలి, మాడుగుల పరిశీలనలో ముత్తంశెట్టి
=అనితకు అనకాపల్లి ఇస్తే ఎలా ఉంటుందోనని యోచన
=టీడీపీలో రగులుతున్న గ్రూపుల రాజకీయం
తెలుగుదేశం పార్టీలో అంతర్గత కలహాలు మరో సారి భగ్గు మనబోతున్నాయి. మంత్రి గంటా శ్రీనివాసరావును పార్టీలో చేర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పచ్చ జెండా ఊపారు. దీనిని జీర్ణించుకోలేని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. గంటా గ్రూప్ పార్టీలోకి వస్తే జిల్లాలో కాపు బలం, కాసు బలం చేకూరుతుందనే లెక్కతో చంద్రబాబు సాగిస్తున్న రాజకీయం చివరకు అయ్యన్న? గంటానా? తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి: రాష్ట్ర విభజన బిల్లు నేపథ్యంలో జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలంగాణ బిల్లు అసెంబ్లీకి రాగానే గంటా ఆయన అనుచర ఎమ్మెల్యేలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసి కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తారు. ఆ తర్వాత మూడు, నాలుగు రోజుల్లో సైకిలెక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజనకుకాంగ్రెస్‌పార్టీ అడుగులు వేసిన తొలినాళ్లలోనే మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన వర్గీయులైన ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, చింతలపూడి వెంకట్రామయ్యలకు రాజకీయ జ్వరం ప్రారంభమైంది. హస్తం గుర్తు మీదే మళ్లీ పోటీ చేస్తే గల్లంతు కాక తప్పదనే నిర్ణయానికి వచ్చారు.
యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు కూడా వీరి వర్గంలో సభ్యత్వం తీసుకున్నారు. వీరంతా కలిసి ఒకే పార్టీలో చేరాలని అనేక ఆలోచనలు చేశారు. చివరకు టీడీపీలో తన మద్దతు దారులందరికీ టికెట్లు ఇప్పించేందుకు గంటా చేసిన డిమాండ్ పూర్తిగా నెరవేరలేదు. ఇందులో కన్నబాబు, చింతలపూడి వెంకట్రామయ్యకు చోటు దక్కలేదని తెలిసింది. ఈ ఇద్దరినీ ఏదో ఒక రీతిలో సంతృప్తి పరచే ఒప్పందం కుదుర్చుకున్న గంటా గ్రూప్ సైకిల్ ఎక్కేందుకే నిర్ణయించుకుంది. అయితే గంటాతో వున్న రాజకీయ వైరం, ఆయన వర్గం మొత్తం వస్తే పార్టీలో గంటాకు పెరిగే ఆధిపత్యం ఆలోచనతో పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు జీర్ణించుకోలేక తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు.
చివరకు చంద్రబాబు చెప్పినా అయ్యన్న అవుననేందుకు ఇష్టపడలేక పోతున్నారు. ఇదే సమయంలో గంటా శ్రీనివాసరావుకు విశాఖ లోక్‌సభ టికెట్, పంచకర్ల రమేష్ బాబుకు విశాఖ నార్త్ నియోజక వర్గాలను చంద్రబాబు ఖరారు చేశారని సమాచారం. ముత్తం శెట్టి శ్రీనివాసరావును అనకాపల్లి ఎంపీ స్థానానికి పోటీ చేయించాలని తొలుత చంద్రబాబు భావించినా ఇంత వరకు ఖరారు కాలేదు. చంద్రబాబుతో కుదిరిన ఒప్పందం ప్రకారం గంటా శ్రీనివాసరావును విశాఖ లోక్‌సభ స్థానం నుంచి, పంచకర్ల రమేష్ బాబును విశాఖ నార్త్ నుంచి పంచకర్ల రమేష్‌బాబు పోటీ చేయడానికి రంగం సిద్ధమైందని తెలిసింది.
ముత్తం శెట్టి శ్రీనివాసరావును మళ్లీ భీమిలి నుంచి కానీ, మాడుగుల నియోజక వర్గం నుంచి కానీ పోటీ చేయించే ఆలోచన జరుగుతోంది. ముత్తం శెట్టికి భీమిలి ఇచ్చేట్లయితే సకురు రఘువీర్‌కు బదులు ఆయన సతీమణి అనితను అనకాపల్లి అసెంబ్లీ నుంచి పోటీచేయించే ఆలోచనలో టీడీపీ పెద్దలు వున్నారు. చింతలపూడి వెంకట్రామయ్యకు మాత్రం టికెట్ ఖరారు చేసే పరిస్థితి లేక పోవడంతో ఎన్నికల తర్వాత ఏదో ఒక రీతిలో సంతృప్తి పరిచే హామీ ఇచ్చినట్లు సమాచారం. కన్నబాబుకు కూడా టికెట్ విషయమై చంద్రబాబు నుంచి ఎలాంటి హామీ రాలేదని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ వ్యవహారాలపై అయ్యన్న పాత్రుడు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి చక చకా పావులు కదిపారు. తమ మద్దతు దారులందరితో గంటాకు ఘన స్వాగతం పలికించే ఏర్పాట్లు చేశారు. సంకట స్థితిలో చంద్రబాబు అయ్యన్ననే అక్కున చేర్చుకుంటారా? లేక గంటాకే జై కొడతారా? ఇద్దరు కావాలనే రెండు కళ్ల సిద్ధాంతాన్ని అమలు చేస్తే అయ్యన్నను ఏ విధంగా సంతృప్తి పరుస్తారనేది ఆసక్తి కరంగా మారింది.
దేశంలో మంట
Published Sun, Dec 8 2013 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM
Advertisement
Advertisement