పచ్చని చిచ్చు
విశాఖపట్నం : గంటా శ్రీనివాసరావుది ఐరెన్‌లెగ్ అని టీడీపీ నేత అయ్యన్న చేసిన వ్యాఖ్యలు నిజమవుతున్నాయంటూ పార్టీలో చర్చిం చుకుంటున్నారు. గంటా బృందం టీడీపీలో అడుగుపెట్టినప్పటి నుం చీ అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయంటూ ఉదహరించుకుంటున్నారు. సమైక్య ఉద్యమం సమయంలో దారుణంగా ఉన్న టీడీపీ పరిస్ధితి ఇప్పుడిప్పుడే పుంజుకుంటుందని భావిస్తున్న సమయంలో ఈ బృందం చేరిక పార్టీకి పెద్ద షాకయింది.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, శానససభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాస్, చింతలపూడి వెంకట్రామయ్య, పంచకర్ల రమేష్‌బాబు, యూవీ రమణమూర్తి (కన్నబాబు)లు తెలుగుదేశంలోకి రావడం పట్ల జిల్లాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అనుచరులెవరూ వీరివెంట రాలేదు. 30 సంవత్సరాలుగా కొనసాగుతున్న క్యాడర్ వీరిరాకను వ్యతిరేకిస్తోంది. వీరితో వేగేదెలా అన్న సందిగ్ధం అధిష్టానాన్ని వెంటాడుతోంది. నిన్నటి వరకూ పార్టీ అధినేత చంద్రబాబును అవినీతి పరుడు,రాష్ట్రాన్ని విడగొట్టిన అసమర్ధుడు అని విమర్శించిన గంటా బృందం ఇప్పుడు ఎలా ఆయనను సమర్ధిస్తుందని టీడీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు.
కన్నబాబుకు వ్యతిరేకంగా యలమంచిలి కాంగ్రెస్ కార్యకర్తలు మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి ఆయనతో వెళ్లేదే లేదని తేల్చిచెప్పారు. కన్నబాబు పదేళ్లుగా తమను వేధింపులకు గురిచేసి, తప్పుడు కేసులతో అరెస్టు చేయించారని టీడీపీ నేతలు కార్యకర్తలు మండిపడుతున్నారు. అడారి తులసీరావు కుమార్తెను కూడా అరెస్టు చేసిన కన్నబాబును నేతగా అంగీకరించేదే లేదని చెబుతున్నారు. గంటా అనకాపల్లిలో వ్యాపార భాగస్వామి భాస్కర్‌కు పగ్గాలు అప్పగించి అరాచకం సృష్టించారని, చివరకు పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్‌టీఆర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరింపజేయకుండా అడ్డుకొన్నారని అక్కడి పార్టీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. భీమిలిలో ముత్తంశెట్టిదీ ఇదే పరిస్ధితి. ఆయనకు టికెట్ ఇస్తే ఓటమితప్పదని మాజీ శానసభ్యుడు అప్పల నరసింహరాజు స్పష్టం చేశారు.
హిందుజా కంపెనీ ఏజెంట్‌గా వ్యవహరించి టీడీపీ నేతలపై పోలీసులను ఉసిగొల్పిన పంచకర్లను ఎలా అంగీకరించాలని ఉత్తర నియోజక వర్గ నేతలు ప్రశ్నిస్తున్నారు. యాదవుల సీటును మరో వర్గానికి చెందిన పంచకర్లకు కేటాయిస్తే సహించేది లేదని ఆ సంఘ నేతలు ఇప్పటికే గట్టి హెచ్చరికలు పంపారు. గంటా రాజకీయం కారణంగా టికె ట్ రేసులోనే లేని వెంకట్రామయ్య వెంట వెళ్లేదే లేదని గాజువాక కాంగ్రెస్ నేతలు సమావేశంలోనే బహిరంగంగా చెప్పారు. ఆయన పోటీలో లేనప్పుడు ఆయనతో మనకె ందుకని దేశం క్యాడర్ దూరంగా వుంది. పలు పార్టీలు మారి దేశంలో చేరిన వుడా మాజీ చైర్మన్ ఎస్‌ఏ రహ్మాన్ ఆ సామాజిక వర్గంలోనే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.
మత్స్యకార వర్గానికి చెందిన పార్టీ నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్‌ను కాదని రహ్మాన్‌కు టికెట్ ఇస్తే తఢాకా చూపుతామని మత్స్యకారనేతలు స్పష్టంచేస్తున్నారు. ఈ పరిస్ధితుల నేపథ్యంలో గంటా బృందం చేరిన తరువాత విశాఖలో టీడీపీ పరిస్ధితి పెనం మీది నుంచి పొయిలో పడ్టట్లైంది.