నేను కానీ, గంటా కానీ ...
విశాఖపట్నం: టీడీపీలోకి ఎవరిని చేర్చుకోవాలన్నది తమ నిర్ణయం కాదని ఏపీ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు గురువారం విశాఖపట్నంలో విలేకర్ల సమావేశంలో తెలిపారు. తాను కానీ, తన సహచర మంత్రి గంటా శ్రీనివాసరావు కానీ పార్టీలో సభ్యులం మాత్రమేనని స్పష్టం చేశారు. పార్టీలోకి ఎవరిని తీసుకోవాలనే తుది నిర్ణయం మాత్రం చంద్రబాబు నాయుడిదేనని ఆయన వెల్లడించారు.
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన టీడీపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే కొణతాల ఆయన కుటుంబ సభ్యులు పార్టీలో చేరికపై జిల్లాకు చెందిన అయ్యన్నపాత్రుడు వెనుక ఉండి నడిపిస్తున్నారని ప్రచారం జరగుతుంది. టీడీపీలోకి కొణతాల ప్రవేశాన్ని అడ్డుకోవాలని జిల్లాకు చెందిన ఓ సామాజిక వర్గం బలంగా వ్యతిరేకిస్తుంది.
ఆ క్రమంలో అదే సామాజిక వర్గానికి చెందిన జిల్లా మంత్రితోపాటు ఓ ఎంపీ పావులు కదుపుతున్నారు. అందుకు ఎంపీ నివాసం వేదికగా కొణతాల వర్గాన్ని టీడీపీలో చేరకుండా అడ్డుకునేందుకు వ్యూహారచన చేసినట్లు సమాచారం. కొణతాలను పార్టీలోకి తీసుకు వచ్చేందుకు అయ్యన్న పాత్రుడే మమ్ముర ప్రయత్నాలు చేస్తున్నారని ఇదే జిల్లాకు చెందిన పచ్చ పార్టీ ఎమ్మెల్యేలంతా ఆ సమావేశంలో తమ ఆవేశాన్ని ప్రదర్శించారని సమాచారం. ఈ నేపథ్యంలో కొణతాలను టీడీపీ చేరేందుకు ప్రయత్నిస్తున్నారటగా అని విలేకర్లు అడిగి ప్రశ్నకు అయ్యన్నపాత్రుడు పై విధంగా స్పందించారు.