‘అభివృద్ధి వికేంద్రీకరణకు 25 జిల్లాలు అవసరం’
రాజమండ్రి: అభివృద్ధి వికేంద్రీకరణే తమ పార్టీ లక్ష్యమని, అందుకోసం రాష్ట్రంలోని 13 జిల్లాలను 25 జిల్లాలుగా విభజించాల్సిన అవసరముందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు చెప్పారు. రాజమండ్రిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రగతికి మ్యాపు సిద్ధం చేస్తున్నామన్నారు.
రాజధాని ఎక్కడున్నా, అభివృద్ధి అంతటా ఉండాలని, ప్రతి జిల్లా ఒక రాజధాని నగరంతో సమానంగా ప్రగతి సాధించాలని పేర్కొన్నారు. భద్రాచలం డివిజన్‌లోని వెంకటాపురం, చర్ల, వాజేడు, దుమ్ముగూడెం మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనంచేస్తే పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోతాయన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ నాయకులు దూరదృష్టితో వ్యవహరించి కరెంటు, నీరు, సరిహద్దుల విషయంలో లబ్ధిపొందారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. కాకినాడ, రాజమండ్రి మధ్య ఎలక్ట్రానిక్ సిటీని అభివృద్ధి చేయాలని, వ్యవసాయాధారిత పరిశ్రమలను నెలకొల్పాలని, ఇండస్ట్రియల్ టెక్నాలజీ పార్కును స్థాపించడంతో పాటు, పర్యాటకపరంగా అభివృద్ధి చేయాలని కోరారు.