జిల్లాలో రైల్వేల ప్రగతికి గ్రహణం పట్టింది. కొత్త రైలు మార్గాల ప్రతిపాదనలను దశాబ్దాలుగా రైల్వేమంత్రిత్వ శాఖ కాగితాలకే పరిమితం చేస్తోంది. ప్రతీసారి రైల్వేబడ్జెట్‌కు ముందు జిల్లా అవసరాలకు సంబంధించి చేస్తున్న విన్నపాలు అరణ్యరోదనగానే మిగులుతున్నాయి. జిల్లాలో ఉన్న ప్రధాన రైల్వేస్టేషన్లలో సౌకర్యాలపైనా అధికారులు శ్రద్ధ చూపడం లేదు.
భారీ ఆదాయాలను సమకూరుస్తున్న స్టేషన్లలోనూ ప్రయాణికులు అవస్థలు పడాల్సి వస్తోంది. నాలుగు కొత్త రైలుమార్గాల కోసం జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు దశాబ్దాలుగా ప్రతిపాదిస్తున్నా మోక్షం లభించడం లేదు. మంత్రులు, ఎంపీలు మారుతున్నా జిల్లా దశ మాత్రం మారడం లేదు. పనులు ప్రారంభించి రెండు దశాబ్దాలు దాటినా పెద్దపల్లి నుంచి రైలు మార్గం నిజామాబాద్‌కు చేరుకోలేకపోయింది. జిల్లా పట్ల రైల్వేశాఖ ప్రదర్శిస్తున్న వివక్షకు ఇది నిదర్శనం.
సాక్షి, కరీంనగర్ : జిల్లా నుంచి నాలు గు కొత్త రైలుమార్గాలు వే యాలన్న డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. కొత్తపల్లి నుంచి మనోహరాబాద్, కరీంనగర్ నుంచి హైదరాబాద్, కరీంనగర్ నుంచి హసన్‌పర్తి, రామగుండం నుంచి మణుగూరు లైన్ల కోసం ప్రతీ బడ్జెట్‌కు ముందు ప్రజాప్రతినిధులు విన్నవిస్తున్నారు. కొత్తపల్లి- మనోహరాబాద్ లైను ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఇక్కడ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహించినప్పటి నుంచి ప్రతిపాదిస్తున్నా ఫలితం లేదు. కరీంనగర్ నుంచి హైదరాబాద్, హసన్‌పర్తి లైన్ల కోసం ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రతిపాదనలు ఇచ్చారు.
రామగుండం, మణుగూరు లైను కోసం వివేక్ ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్ రైలు మార్గాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీలు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, వివేక్ ప్రయత్నాలు చేస్తున్నా వేగం అందుకోలేదు. కొత్తగా ప్రతిపాదించిన నాలుగు రైలు మార్గాలు కూడా రైల్వేశాఖకు గణనీయమైన ఆదాయం సమకూర్చి పెట్టేవే. అయినా ఈ మార్గాల వైపు రైల్వేశాఖ దృష్టి సారించడం లేదు. మణుగూరు రైలుమార్గానికి 1982లోనే రూ.650 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. అప్పటి నుంచి ఈ లైను గురించి పట్టించుకున్నవారే లేరు. ఎంపీ వివేక్ 2010లో ఈ ప్రతిపాదనను రైల్వేమంత్రి దృష్టికి తేగా సర్వే నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. నాలుగేళ్లుగా ఇదే తంతు సాగుతోంది.
జిల్లా కేంద్రానికి ఉన్న ఏకైక రైలు మార్గం పనులు రెండు దశాబ్దాలుగా పూర్తి కావడం లేదు. 1992లో ప్రధాని పీవీ నర్సింహారావు శంకుస్థాపన చేసిన పెద్దపల్లి - నిజామాబాద్ రైలు మార్గం పనులు నత్తనడకన సాగుతున్నాయి. పెద్దపల్లి నుంచి కరీంనగర్-జగిత్యాల వరకు పనులు పూర్తయినా అక్కడ నుంచి ముందుకు సాగడం లేదు. 1992లో రూ.400 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు ప్రారంభించారు. ఏటా అరకొర నిధులు కేటాయించడంతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. మొత్తం 178 కిలోమీటర్ల ఈ మార్గం జిల్లాలో 122 కిలోమీటర్లు, నిజామాబాద్ జిల్లాలో 56 కిలోమీటర్ల పొడవుంది. ఏళ్లకేళ్లుగా జాప్యం జరగడంతో అంచనా వ్యయం రెట్టింపయింది. ఇప్పటికే రూ.560 కోట్లు ఖర్చు చేయగా మరో రూ.385 కోట్లు అవసరమని అంచనా వేశారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ వరకు లైను పూర్తయింది. ప్రయోగాత్మకంగా 2012 మార్చిలోనే రైలు నడిపారు. భూసేకరణలో ఇబ్బందులతో పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇంకా 20 కిలోమీటర్ల వరకు భూసేకరణ చేయాల్సి ఉంది.
ఈ లైను పూర్తి చేస్తామని ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లోనే చెప్పినా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. రైల్వేబడ్జెట్‌కు సంబంధించి రైల్వేబోర్డు కసరత్తును నాలుగునెలల ముందే ప్రారంభిస్తుంది. నిజామాబాద్ రైలు మార్గం పూర్తితోపాటు ప్రతిపాదనల్లో ఉన్న రైలు మార్గాలపైనా ప్రజాప్రతినిధులు ఇప్పుడే నిర్దిష్ట ప్రతిపాదనలతో రైల్వే మంత్రిత్వశాఖ మీద ఒత్తిడి తేవాల్సిన అవసరముంది. గట్టిగా ప్రయత్నిస్తే తప్ప ఈసారి కూడా జిల్లాకు మొండిచేయే మిగులుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
జీవితకాలం లేటు!
Published Thu, Nov 7 2013 3:36 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM
Advertisement
Advertisement