వైసీపీతోనే గ్రామాల అభివృద్ధి
భీమవరం, న్యూస్‌లైన్ : తీర ప్రాంత గ్రామాల అభివృద్థి వైఎస్సార్ సీపీకే సాధ్యమని ఆ పార్టీ నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పేర్కొన్నారు. భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌తో కలిసి మండలంలోని పలు గ్రామాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా రోడ్ షో, ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రసాదరాజు మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోగ్రామాలు అభివృద్ధిబాటలో పయనించాయన్నారు. ఆయన మృతి తరువాత ప్రభుత్వం నిర్లక్ష్యంతో తాగునీరు, సాగునీరుకు గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మౌలిక సదుపాయాలు కూడా సక్రమంగా లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడబోయే ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.
గ్రామాల అభివృద్ధి జరగాలంటే రాజన్న రాజ్యం తిరిగి రావాలన్నారు. అందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలన్నారు. తద్వారా గ్రామాల అభివృద్ధికి బాటలు వేయాలని ఆయన కోరారు. భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వస్తే గ్రామాలకు మహర్దశ పట్టనుందన్నారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు.
అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలను విస్మరించిందన్నారు. జెడ్పీటీసీ అభ్యర్థిని రేవు వెంకట సత్యవతి, లోసరి ఎంపీటీసీ అభ్యర్థి బొమ్మిడి వాణి, కొత్తపూసలమర్రు ఎంపీటీసీ అభ్యర్థి తిరుమాని తులసీరావు, గూట్లపాడు అభ్యర్థి కొప్పర్తి లక్ష్మిమంగతాయారు, గొల్లవానితిప్ప అభ్యర్థి మల్లాడి లక్ష్మికుమారి పాల్గొన్నారు.