ప్రత్యేక రాష్ట్రంతోనే అభివృద్ధికి మోక్షం
Published Thu, Aug 29 2013 1:08 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM
ఘట్‌కేసర్ టౌన్, న్యూస్‌లైన్: స్వాతంత్య్రం రాకమునుపు ఏర్పాటుచేసిన ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ ఇప్పటికీ అబివృద్ధికి ఆమడదూరంలోనే ఉంది. పాలకుల నిర్లక్ష్యం స్థానిక రైల్వే ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. ఘట్‌కేసర్‌లో రైల్వే హబ్ ఏర్పాటు, ఎంఎంటీఎస్ రైళ్ల పొడగింపు, స్టేషన్ ఆధునికీకరణ, మూడో రైలు మార్గం ఏర్పాటు తదితర ప్రతిపాదనలు దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైంది. కనీసం ఈ స్టేషన్‌లో ఒక క్యాంటీన్ కూడా లేదంటూ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
నిజాంల కాలంలో ఏర్పాటు చేసిన ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ సమస్యలకు నిలయంగా మారింది. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లే ప్రధాన రైల్వేలైను కావడంతో ఇక్కడ రోజూ వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపడం, రైల్వే పోలీసులను నియామకం, మండల ప్రజల చిరకాలవాంఛ అయిన ఎంఎంటీఎస్ రైళ్ల పొడగింపు తదితర ప్రతిపాదనలకు ప్రతిసారి నాయకుల నుంచి హామీలు తప్పా కార్యరూపం దాల్చడం లేదు. ఘట్‌కేసర్ నుంచి భువనగిరి వరకు మూడోరైలు మార్గం ఏర్పాటు ప్రతిపాదన ప్రతిసారీ చర్చకు వస్తున్నా.. బడ్జెట్‌లో మాత్రం నిధుల కేటాయింపు జరగడం లేదు. అదే సమయంలో ఇంతకంటే తక్కువ సంఖ్యలో రైళ్లు నడిచే ఆంధ్రా ప్రాంతంలోని రైల్వే స్టేషన్‌లలో సకల సౌకర్యాలు ఉంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కేంద్ర స్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లు తీసుకురాకపోవడంతోనే ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే బడ్జెట్‌లో కేటాయించే నిధులన్నీ సీమాంధ్ర ప్రాంతానికి తరలుతున్నాయని వారు విమర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ప్రయాణికులు భావిస్తున్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా మూడో లైను నిర్మాణం, రైల్వేహబ్ ఏర్పాటు, ఎంఎంటీస్ లైన్ పొడగింపు తదితర సమస్యలన్నీ పరిష్కారానికి నోచుకుంటాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఎంఎంటీఎస్ రైళ్లను పొడిగించాలి
నగరానికి అతి సమీపంలో ఉన్న ఘట్‌కేసర్ మండలానికి ఎంఎంటీఎస్ రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించిన రైల్వేశాఖ ఇప్పటి వరకు ఎలాంటి పనులు ప్రారంభించలేదు. మండల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఎంఎంటీఎస్ రైళ్లను పొడగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు వేలాది సంఖ్యలో రోజూ హైదరాబాదు, ఇతర ప్రాంతాలకు రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. స్థానిక స్టేషన్ వరకూ ఎంఎంటీఎస్ రైళ్లను పొడగిస్తే వీరందరికీ మేలు చేకూరుతుంది.
- వేములు మహేష్‌గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు
మూడోలైన్ నిర్మాణం చేపట్టాలి..
సికింద్రాబాదు నుంచి కాజీపేట్ మార్గంలో ఘట్‌కేసర్ మీదుగా మూడో రైల్వేలైన్ ఏర్పాటుచేయడం ద్వారా ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించవచ్చు. ఇప్పటికే రైల్వే అధికారులు ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ లైన్ ఏర్పాటుతో సికింద్రాబాదు-ఘట్‌కేసర్-కాజీపేట్ మార్గంలో నడిచే రైళ్లు ఏ విధమైన క్రాసింగులు లేకుండా నిరాటంకంగా రాకపోకలు సాగించవచ్చు. లేకపోతే స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్ల పేరుతో గంటల తరబడి ప్యాసింజర్ రైళ్లు నిలిచిపోయి ప్రయాణికులకు పడుతున్న ఇబ్బందులకు మోక్షం లభించదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప ఈ ప్రాంత రైల్వే ప్రయాణికుల సమస్యలు తీరే పరిస్థితి కనిపించడం లేదు.
- మమత, నిర్మల పురస్కార్ అవార్డు గ్రిహీత, మాజీ సర్పంచ్, ఘనాపూర్
నిరుద్యోగ సమస్య తీరుతుంది..
మండలానికి ఎంఎంటీఎస్ రైళ్ల రాక, రైల్వేహబ్ నిర్మాణం, రైల్వేస్టేషన్ ఆధునీకరణతో నిరుద్యోగ సమస్య తీరుతుంది. స్టేషన్ ఆధునికీకరణతో స్థానికంగా వందల మందికి ఉపాధి లభించే అవకాశం కలుగుతుంది. ఏ రాష్ట్రంలోనైనా పారిశ్రామిక అభివృద్ధికి మెరుగైన రవాణా సౌకర్యం ఉండి తీరాల్సిందే. అయితే ఘట్‌కేసర్ స్టేషన్‌లో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం విచారకరం. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మొదటగా ఎంఎంటీఎస్ పొడగింపుపై దృష్టిపెట్టాలి. లేకపోతే ఘట్‌కేసర్ అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంటుదనడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు.
- బొక్క ప్రభాకర్‌రెడ్డి, కాంట్రాక్టర్
విద్యార్థులకు మేలు జరుగుతుంది
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న మండలానికి ఎంఎంటీఎస్ రైలు వ్యవస్థను పొడిగిస్తే ఈ ప్రాంతలో విద్యారంగం అభివృద్ధి చెందుతుంది. నగరానికి సమీపంలో ఉండటంతో ఇక్కడ వందలాది సంఖ్యలో ఇంటర్, ఇంజినీరింగ్ తదితర విద్యా సంస్థలు ఏర్పడ్డాయి. మండలంలో జాతీయ రహదారి ఉండటంతో ప్రస్తుతానికి విద్యార్థులు బస్సులను ఆశ్రయిస్తున్నారు. అయితే సరిపోను బస్సులు లేక కిక్కిరిసి ప్రయాణిస్తూ విద్యార్థులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఎంఎంటీస్ రైళ్లను ఘట్‌కేసర్ వరకు పొడగిస్తే విద్యార్థులకు, ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
-రాములు, కల్లుగీత సంఘం జిల్లా అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ చౌదరిగూడ
రైల్వేహబ్ నిర్మించాలి...
సికింద్రాబాదు రైల్వేస్టేషన్‌లో రైళ్ల తాకిడిని తప్పించడానికి అక్కడి వరకు రైళ్లన్నీ వెళ్లకుండా మండలంలోనే రైల్వేహబ్‌ను నిర్మించాలని రైల్వే అధికారులు ప్రణాళిక రూపొందించారు. అయితే స్థానికంగా ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులో ఉంటే మండలంలో దిగిన ప్రయాణికులు వాటి ద్వారా నగరానికి వెళ్లడానికి వీలుంటుంది. అయతే ఈ ప్రతిపాదనలు దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రత్యేక రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి స్థానిక రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధుల కేటాయింపులు జరిగేలా చూడాలి. తెలంగాణ ప్రభుత్వ కూడా ఎంఎంటీఎస్ లైన్ పొడగింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
- బద్ధం గోపాల్‌రెడ్డి, స్థానికుడు
వ్యాపార రంగం అభివృద్ధి చెందుతుంది...
మండలంలోని చెర్లపల్లి పారిశ్రామిక వాడ, నల్గొండ జిల్లా సరిహద్దు జాతీయ రహదారి సమీపంలో కొండమడుగు వద్ద ఉన్న పారిశ్రామిక వాడ, అంతర్జాతీయ వ్యాపార సంస్థలు రహేజా పార్కు, ఇన్ఫోసిస్ సంస్థలు మండలంలో నిర్మించబడ్డాయి. మండలంలోని ఏదులాబాదు గ్రామంలో పారిశ్రామిక వాడను నిర్మించాలని ఈ మధ్యనే ప్రభుత్వం సర్వే కూడా నిర్వహించింది. మండలంలో రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేస్తే ఈ వ్యాపార సంస్థలకు మేలు చేకూరుతుంది. రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉంటే మరికొన్ని వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా ఇక్కడకు వచ్చే అవకాశం ఉంది.
- బొమ్మక్ శ్రీనివాస్, తెలుగుయువత జిల్లా ఉపాధ్యక్షుడు
Advertisement
Advertisement