'తిరుమలకు తెలుగుగంగా నీటిని తరలిస్తాం'
హైదరాబాద్: తిరుమలలో తాగునీటి సమస్యను నివారించేందుకు చర్యలు తీసుకుంటామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా వెల్లడించారు. అందులోభాగంగా తెలుగుగంగా నీటిని తిరుమలకు తరలిస్తామని ఆయన తెలిపారు. ఆదివారం వీఐపీ ప్రారంభ సమయంలో తిరుమలలో శ్రీవారిని దేవినేని ఉమా దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ను నాలుగేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
శేషాచల కొండల్లో ఎర్రచందనాన్ని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. రాష్ట్ర ప్రజలు, రైతుల సంక్షేమం కోసం ఎర్రచందనాన్ని రెండు నెలలో వేలం వేస్తామని దేవినేని ఉమా వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ ఇచ్చిన హమీలను తమ తప్పక నెరవేరుస్తుందని తెలిపారు.