తిరుమల : తిరుమలలో వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు మృతి చెందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్టుమెంట్ నెంబర్ 16లోని మరుగుదొడ్ల దగ్గర వృద్ధురాలు పడి ఉండటాన్ని గమనించిన విజిలెన్స్ అధికారులు ఆమెను హుటాహుటిన అశ్వని ఆస్పత్రి తరలించారు. అయితే అప్పటికే వృద్ధురాలు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఆమె మరణించిందని చెప్పారు. అయితే మృతికి కారణాలు ఏంటన్న విషయం మాత్రం ఇంకా నిర్ధారించలేదు. పోస్టుమార్టం చేస్తే గానీ కారణాలు తెలియవని అంటున్నారు. మృతురాలు తమిళనాడులోని ఆర్కాట్ జిల్లాకు చెందిన దేవికగా పోలీసులు గుర్తించారు. ఆమె అక్కడ పూలు అమ్ముకుని జీవిస్తుంటుందని తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు .