అమరావతి : ‘పోలీసులపై రాజకీయ నాయకులు చేసే స్టేట్‌మెంట్లు పట్టించుకోనవసరం లేదు. నేను పబ్లిక్ సర్వెంట్‌ని, నన్ను కలవడానికి వచ్చిన వారిని తప్పకుండా కలుస్తాను. దురదృష్టవశాత్తు మీటింగ్‌ల వల్ల ఏదో ఒకరోజు కార్యాలయంలో అందుబాటులో లేకపోతే.. దానికే డీజీపీ అందుబాటులో ఉండరు అంటే ఎలా’ అని డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరణ ఇచ్చారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలలో డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అశువులు బాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా జపుకుంటున్నాం. అమరలైన పోలీసుల త్యాగాలు మరువలేనివి. గత వారం రోజులుగా పోలీసుల సేవలు తెలియపరిచేలా ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించాం. 2511 పాఠశాలలు, కళాశాలల నుంచి వచ్చిన 1,81,315 మంది విద్యార్థులు ఓపెన్ హౌస్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
రహదారి భద్రత, సిటిజన్ సెంటర్ సర్వీస్, డ్రోన్స్, టెక్నాలజీ పోలిసింగ్, డయల్ 100, క్లూస్ టీమ్స్, ఆయుదాల వంటి వాటి గురించి తెలియజేశాం. పోలీసుఅమరవిరుల స్మరణదినం సందర్బంగా 10,513 మంది పోలీసులు, ప్రజలు రక్తదానం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం పోలీసులకు కల్పించిన వీక్లీ ఆఫ్‌ల వల్ల 62,000 కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరిశాయి. పోలీసుల వీక్లీ ఆఫ్‌లకు సంబంధించి ఒక యాప్‌ను త్వరలో ప్రవేశపెట్టబోతున్నాం. పోలీసు కుటుంబాల ఆరోగ్యం కోసం ఆరోగ్య భద్రత స్కీమ్ బాగా ఉపయోగపడుతోంది. పోలీసులు విధి నిర్వహణలో మరణిస్తే దాదాపు 40 లక్షల ఇన్స్యూరెన్స్ అందిస్తున్నాం. దేశంలోనే మొదటిసారి ఇంత పెద్ద మొత్తం ఏపీలోనే అందిస్తున్నాం.
హోంగార్డ్స్‌కు రోజూవారీ వేతనం రూ.600 నుంచి రూ.710 వరుకు పెంచాం.1 5,000 మంది హోంగార్డులకు ప్రయోజనం చేకూర్చేలా వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రభుత్వం ప్రారంభించిన స్పందన కార్యక్రమం బాగుంది. స్పందనలో మహిళలే ఎక్కువ మంది ఫిర్యాదులు చేయగలుగుతున్నారు. ఇప్పటి వరకు 14 స్పందన కార్యక్రమాలు జరిగాయి. ఇందులో 37,773 ఫిర్యాదులు వస్తే 31,119 ఫిర్యాదులను పరిష్కరించాం. ఈ సందర్భంగా జర్నలిస్టులపైన జరుగుతున్న దాడులను ప్రస్తావించగా.. యూనియన్ నేతలు కలిశారని, జర్నలిస్టులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని' హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment