
కోటయ్యది కిరికిరి కమిటీ : ధర్మాన
రైతు రుణాలపై కోటయ్యతో కిరికిరి కమిటీ వేశారని వైఎస్సార్సీపీ నేత ధర్మాన ప్రసాదరావు ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు.
ఏలూరు : రైతు రుణాల మాఫీపై కోటయ్యతో కిరికిరి కమిటీ వేశారని వైఎస్సార్సీపీ నేత ధర్మాన ప్రసాదరావు ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన 48 గంటల రైతు దీక్ష శనివారం ప్రారంభమైంది. ఈ దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ... చంద్రబాబును నమ్మి రైతులు, మహిళలు మోసపోయారన్నారు.
రుణాలు మాఫీ చేయకపోవడం వల్లే రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ రాలేదని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల నుంచి తప్పించుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ధర్మాన ఆరోపించారు. ప్రభుత్వం రైతుల రుణాలు మాఫీ చేసింది కేవలం రూ. 3900 కోట్లు మాత్రమే అని ధర్మాన ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఇంకా రూ. 56, 900 కోట్ల రుణాలు రైతులకి ఇవ్వవలసి ఉందని ధర్మాన ప్రసాదరావు చెప్పారు.