నాడు వైఎస్ఆర్ మాటలను లెక్కచేయనందుకే..
హైదరాబాద్: ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ చేపట్టిన సమర దీక్ష రెండో రోజూ కొనసాగుతోంది. అందులో భాగంగా వైఎస్సార్సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాద్ రావు ఏపీ సీఎం చంద్రబాబు పాలనా తీరును ఎండగట్టారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న కాలంలో ఆయన మాటలను లెక్కచేయనందుకే పదేళ్ల పాటు టీడీపీ అధికారానికి దూరమైందని ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ప్రధాన ప్రతిపక్షం చెబుతున్న పనులకు సవరణలు చేస్తే నేడు రాష్ట్రంలో ఈపరిస్థితి ఉండేది కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా ప్రతిపక్ష నాయకుడిగా ఎంతో మేలు చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చారు. అదే తరహాలో నేడు మహానేత తనయుడు ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. శాసన సభలో ఆనాడు వైఎస్ఆర్ మాటలను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా పదేళ్లు అధికారానికి దూరమైంది. రాష్ట్రంలో పురుగుల మందు తాగి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వ పట్టించుకోలేదు.
ప్రభుత్వ సహాయం కోసం ప్రజలు ఎదురు చూస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. నాడు వైఎస్సార్ పాదయాత్రను ప్రజల భరోసాగా మలిచారు. ఇచ్చిన మాట ప్రకారమే రైతుల ఉచిత విద్యుత్ పై తొలి సంతకం చేశారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసి.. మారానని నమ్మబలికి చంద్రబాబు గెలిచారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఏ ఒక్క హామీని నెరవేర్చిన పాపాన పోలేదు. ఐదేళ్ల ప్రభుత్వానికి ఏడాదిలోపే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి" అని ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.