జిల్లాలో అతిసార (డయేరియా) ప్రబలుతోంది.
ప్రబలుతున్న అతిసార
ఇప్పటికే ఒకరి మృతి
వందల్లో బాధితులు
ముందస్తు జాగ్రత్తలు చేపట్టని అధికారులు
గుంతకల్లు మండలం నల్లదాసరిపల్లికి చెందిన రమాదేవి అలియాస్ రామక్క (28) బతుకుదెరువు కోసం 20 రోజుల క్రితం భర్త శ్రీనివాసులు, కుమార్తె సుజితతో కలిసి పామిడికి వలస వచ్చింది. నాగలకట్ట వీధిలో ఉంటూ కూలి పనులు చేసేది. ఈ నెల 15న వాంతులు, విరేచనాలు అధికం కావడంతో కుటుంబ సభ్యులు అక్కడి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందింది. ఆమె కుమార్తెకు కూడా అతిసార సోకడంతో చికిత్స తీసుకుంది.
అనంతపురం మెడికల్ :
జిల్లాలో అతిసార (డయేరియా) ప్రబలుతోంది. గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. ఈగల బెడద కూడా ఎక్కువైంది. వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టకపోవడంతో ప్రజలు అతిసార బారిన పడుతున్నారు. ఎవరైనా చనిపోతే తప్పా అధికార యంత్రాంగం ముందుకు కదలడం లేదు.
ఒక్క అనంతపురం సర్వజనాస్పత్రిలోనే ఈ నెల ఒకటి నుంచి శనివారం వరకు 339 మంది అతిసార బాధితులు చేరారు. వీరిలో 156 మంది పురుషులు, 183 మంది మహిళలు ఉన్నారు. పామిడికి చెందిన కేసులు అధికంగా నమోదవుతున్నట్లు ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. ఈ నెల 15 నుంచి 20 మధ్య పామిడి, ఆ పరిసర గ్రామాలకు చెందిన పర్వీన్, కదిరమ్మ, ఓబుళమ్మ, ఖాజావలి, హనుమంతరెడ్డి, శ్రావణి సర్వజనాస్పత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం పామిడి మండలం దేవరపల్లికి చెందిన సుమలత (22) చికిత్స తీసుకుంటోంది.
పీహెచ్‌సీల్లో అందని వైద్యం
అతిసార సోకగానే బాధితులు వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీలు)కు వెళ్తున్నారు. అక్కడ సరైన వైద్యం అందడం లేదు. రోగి పరిస్థితి ఆందోళనకరంగా లేనప్పటికీ ‘మనకెందుకొచ్చిందిలే’ అని వైద్యులు ఏరియా, జిల్లా ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
ముందు జాగ్రత్తలతో నివారణ
కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే అతిసార బారిన పడకుండా ఉండవచ్చు. ముఖ్యంగా క్లోరిన్ కలిపిన నీరు సరఫరా అవుతోందా, లేదా పరిశీలించాలి. గ్రామాల్లోని వాటర్ ట్యాంకుల్లో సరిగ్గా బ్లీచింగ్ అవుతోందా అన్న విషయం పరిశీలించాలి. ఏదైనా లోపముంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను ఇళ్లలో నిల్వ ఉంచుకోవాలి. కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
అతిసార లక్షణాలు
వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, దాహం, నోరు ఎండిపోవడం, మూత్ర విసర్జన తగ్గిపోవడం.
కారణాలు
కలుషిత నీరు, ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అతిసార సోకుతుంది. నిల్వవున్న ఆహార పదార్థాలు తినడం మంచిది కాదు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత లోపించినా కూడా అతిసార సోకే ప్రమాదముంది.
‘అనంత’లోనూ పెరుగుతున్న బాధితులు
అతిసార అనంతపురం నగరంలోనూ ప్రబలుతోంది. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని గొప్పలు చెబుతున్న ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పట్టించుకోకపోవడంతో ఏ డివిజన్‌లో చూసినా చెత్తాచెదారమే దర్శనమిస్తోంది. ఫలితంగా రోగాలు ప్రబలుతున్నాయి. రాంనగర్‌కు చెందిన బాషా, రామ్మోహన్, నాగలక్ష్మి రెండ్రోజుల క్రితం అతిసారతో సర్వజనాస్పత్రిలో చేరారు. ఆదివారం ఉదయం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ వెనుకభాగంలోని మటన్‌మార్కెట్ వద్ద నివాసముంటున్న భారతి (35) కూడా ఆస్పత్రిలో చేరింది.
పరిశుభ్రత ముఖ్యం
అతిసార ప్రబలకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం. చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఈగలు వాలకుండా వంట పాత్రలపై మూతపెట్టాలి. ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినాలి. మురికినీరు నిల్వ ఉండకుండా చూడాలి. పరిసరాల్లో చెత్తకుప్పలు వేయరాదు.
- డాక్టర్ శివకుమార్, ఏడీఆర్‌ఎం, అనంతపురం సర్వజనాస్పత్రి
అధికారులను అప్రమత్తం చేశాం
వ్యాధులు ప్రబలకుండాచర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓలకు ఆదేశాలు జారీ చేశాం. అతిసారపై ప్రజలను అప్రమత్తం చేయడానికి కరపత్రాలు పంపిణీ చేస్తాం. కళాజాతాలు నిర్వహిస్తాం. హెల్త్ ఎడ్యుకేటర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. అన్ని ఆస్పత్రుల్లో మందులు సిద్ధంగా ఉన్నాయి. - వెంకటరమణ, అడిషనల్ డీఎంహెచ్‌ఓ.